పాఠశాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పాఠశాల పరిశీలన

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

పాఠశాల పరిశీలన ‘స్పెషల్‌ కేటగిరీ’ సర్టిఫికెట్ల పరిశీలన గ్రామసభలతో పారదర్శక పాలన ఈవీఎం గోడౌన్‌కు పటిష్ట భద్రత

పెనుగంచిప్రోలు: ప్రధానమంత్రి స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కేవీఆర్‌ జెడ్పీ హైస్కూల్‌ను సమగ్రశిక్ష రాష్ట్ర స్థాయి అధికారులు సందర్శించారు. పీఎంశ్రీ ప్రాజెక్టుకు సంబంధించిన పాఠశాలలో అమలవుతున్న పథకాలను, మనబడి–మన భవిష్యత్తుకు సంబంధించి మంజూరైన అదనపు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల సిలబస్‌, పాఠ్య పుస్తకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయి అధికారులు బట్టు సురేష్‌, అశోక్‌, ఎంఈఓ డి. రవీంద్ర, హెచ్‌ఎం కె. జలజ తదితరులు పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో పాలిసెట్‌–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం సోమవారం మొదలైంది. స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులైన ఎన్‌సీసీ, క్యాప్‌ కేటగిరికి చెందిన 1 నుంచి 60వేల ర్యాంకు వరకు, దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్స్‌ కేటగిరీకి చెందిన వారికి మొదటి నుంచి చివర ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించారు. సోమవారం మొత్తం 321 మంది సర్టిఫికెట్లను పరిశీలించామని పాలిసెట్‌–2026 ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ ఎం.విజయసారథి చెప్పారు.

నేటి షెడ్యూల్‌..

మంగళవారం ఉదయం 9గంటల నుంచి క్యాప్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 60,001 నుంచి చివరి ర్యాంకు వరకు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గౌడ్స్‌ అభ్యర్థులకు మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు.

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే గ్రామసభలతో పారదర్శకమైన పాలన ప్రజలకు అందుతోందని పంచాయతీరాజ్‌ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ మల్లేశ్వరి తెలిపారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో మాల్దీవుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆమె గ్రామ పంచాయతీలు, గ్రామ సభల నిర్వహణ, వాటి ప్రయోజనాలపై వారికి వివరించారు. స్థానిక జెడ్పీ పాఠశాల, గ్రామ పంచా యతీ కార్యాలయాల వద్ద నిర్వహించిన మహిళలు, బాలలు, గ్రామస్తులతో వేర్వేరుగా గ్రామసభలు నిర్వహించారు. గతంలో జరిగిన గ్రామసభలో నిర్ణయించిన పనుల వివరాలు మాల్దీవుల బృందానికి తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు ఏ మేరకు పనులు పూర్తి చేశారనే అంశాలను వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి సీతామహాలక్ష్మి, ఎన్‌ఐఆర్‌డీ సంస్థ ప్రతినిధి శిరీష, డీఎల్‌పీఓ రాఘవన్‌, ఎంపీడీఓ డి.శకుంతల తదితరులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాంకు పటిష్ట భద్రత కల్పించామని, అయిన్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం గొల్లపూడిలోని అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలోగల ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాంను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పని తీరుతోపాటు అగ్నిమాపక, విద్యుత్‌ పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. డీఆర్‌ఓ ఎం. లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి (వైఎస్సార్‌ సీపీ), యేదుపాటి రామయ్య (టీడీపీ), మురళీకృష్ణ(ఐఎన్‌సీ), జె. శ్రీనివాసరావు (జనసేన) తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement