కేసులకు భయపడం.. పోరాటం ఆపం | - | Sakshi
Sakshi News home page

కేసులకు భయపడం.. పోరాటం ఆపం

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

కేసులకు భయపడం.. పోరాటం ఆపం

అమరావతి రైతుల విషయంలో వెనుకంజ వేయబోం వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): అక్రమ కేసులకు భయపడి అమరావతి రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ చేస్తున్న పోరాటంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతమంది పోలీసులను, గూండాలను, మాఫియా ముఠాలను దించి తమపై దాడులకు ఉసిగొల్పినా.. రైతుల కోసం మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటామని చెప్పారు. అమరావతికి భూములివ్వని రైతులను ప్రభుత్వమే వేధిస్తూ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు నిజం కాబట్టి, అవి బయటి ప్రపంచానికి తెలియకుండా చేయాలన్న కుట్రతోనే రైతు పరిరక్షణ కమిటీగా వెళ్తున్న తమపై టీడీపీ గూండాలు ఉండవల్లిలో దాడులు చేశారని ధ్వజమెత్తారు. పైగా తామే రౌడీలతో దాడులకు వెళ్తున్నట్టు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తాము పిలిస్తేనే వైఎస్సార్‌ సీపీ నేతలు వచ్చారని పెనుమాక రైతులు ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దోపిడీ వెలుగులోకి వస్తుందని భయం..

ఆంధ్రప్రదేశ్‌లో బిహార్‌ని మించిన జంగిల్‌ రాజ్‌ పాలన సాగుతోందని అవినాష్‌ విమర్శించారు. ప్రభుత్వ దోపిడీ, అరాచకాలను తట్టుకోలేక రైతులు వైఎస్‌ జగన్‌ను కలిస్తే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ రైతు పరిరక్షణ కమిటీ రైతులను కలవడానికి వెళ్తుంటే అడ్డుకోవడమే అప్రజాస్వామికం అయితే, తమ మీదనే దాడులు చేసి.. తిరిగి తమ మీదనే కేసులు పెట్టడం జంగిల్‌ రాజ్‌ పాలనకు నిదర్శనమన్నారు. టీడీపీ గూండాలతోపాటు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ముఠాలతో కూడిన వందల మంది రౌడీలు తమపై దాడికి తెగబడ్డారని వివరించారు. పోలీసులు చట్టాలను ఉల్లంఘించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారని విమర్శించారు.

అమరావతికి వ్యతిరేకం కాదు..

వైఎస్సార్‌ సీపీ అమరావతికి వ్యతిరేకం అని ఎప్పుడూ చెప్పలేదని అవినాష్‌ స్పష్టం చేశారు. రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. అమరావతికి భూములిచ్చిన ఒక్క రైతుకై నా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చి ఉంటే చూపించాలని డిమాండ్‌ చేశారు. వారికి మేలు జరిగితే న్యాయం కోసం తమ వద్దకు ఎందుకొస్తారని ప్రశ్నించారు.

అటకెక్కిన విజయవాడ అభివృద్ధి..

ఈ కూటమి ప్రభుత్వం విజయవాడను ఎప్పుడో గాలికొదిలేసిందని అవినాష్‌ విమర్శించారు. అమరావతి కోసం విజయవాడ నగర అభివృద్ధిని గొంతు పిసికి చంపేస్తున్నారన్నారు. అమరావతి బాధిత రైతులకు అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటను నిలబెట్టుకునే తీరుతామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అమరావతి అవినీతి, దోపిడీని కోర్టుల్లోనే రుజువు చేస్తామని దేవినేని అవినాష్‌ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement