ఏరువాక పౌర్ణమి వేడుకలో కలెక్టర్ లక్ష్మీశ
కన్నెవీడు(వత్సవాయి): దేశానికి వెన్నుముక రైతన్న అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. సోమవారం గ్రామంలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన స్థానిక శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా గ్రామ శివారు నుంచి ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామంలోని తోడ్కోని వెళ్లారు. ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధశాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి అరక దున్నారు.
యంత్ర సాయాన్ని వినియోగించుకోవాలి..
కలెక్టర్ మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి తెలుగు సంప్రదాయాలలో అత్యంత విశిష్టమైనదని తెలిపారు. సాగులో వస్తున్న అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి వ్యవసాయాన్ని సాగించి నట్లయితే శ్రమ తగ్గడంతోపాటు పెట్టుబడులు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. భూమాత ఆశీస్సులతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్, తహసీల్దార్ జి. వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ఎన్. రాంబాబు, ఏవో జి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


