కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలో ‘సర్’ ప్రక్రియలో క్లయిమ్‌లు, అభ్యంతరాలతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి ఆర్డీవోలు, ప్లానింగ్ సెక్రటరీలు, ఎన్నికల విభాగం అధికారులతో సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ సులభంగా జరిగే అవకాశం ఉన్నప్పటికీ పట్టణాలు వాటి స్వరూపం కలిగిన ప్రాంతాల్లో కష్టతరంగా ఉంటుందన్నారు. జూలై 14వ తేదీలోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి తొలిదశ పనులు పూర్తి చేయాలన్నారు.
డిజిటలైజేషన్ వేగవంతం..
సర్ ప్రక్రియలో నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు వేగంగా పనిచేయాలన్నారు. పంపిణీ ప్రక్రియను వెంటనే ముగించి అందుబాటులో లేని వారి ఇళ్లకు వెళ్లి ధ్రువీకరణ చేపట్టాలన్నారు. అందుబాటులోకి రాని దరఖాస్తులను నిబంధనల ప్రకారం అన్ కలెక్టబుల్‌గా నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ఇన్‌చార్జ్ డీఆర్వో పోతురాజు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.


