చిలకలపూడి(మచిలీపట్నం): ఓ వృద్ధ వితంతువుపై లైంగిక దాడికి యత్నించిన యువకుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.రాజావెంకటాద్రి సోమవారం తీర్పు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని రాఘవపురానికి చెందిన 60 ఏళ్ల వితంతువు 2023 ఏప్రిల్ ఎనిమిదో తేదీన పొలాల్లో గేదెలను మేపుతోంది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని చూసిన అదే గ్రామానికి చెందిన కోట్ర గోపీ లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయటంతో భయపడిన గోపీ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీపీ అద్దెపల్లి నిరంజన్ ఆరుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షులను విచారించిన అనంతరం గోపీపై నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పోరంకి గ్రామానికి చెందిన వరహాలరావు(55) తాపీ కార్మికుడిగా జీవిస్తున్నాడు. ఈ నెల 21వ తేదీన రాత్రి బైక్ పై బందరు రోడ్డుపై వెళ్తుండగా పచ్చళ్ల కంపెనీ వద్ద ప్రమాదవశాత్తు వాహనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన పోరంకిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరహాలరావు పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పి.శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జాతీయ రహదారిపై కారు బీభత్సం
గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో అదుపుతప్పిన కారు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటన రామవరప్పాడు రింగ్ రోడ్డులో సోమవారం జరిగింది. రామవరప్పాడు ప్రాంతానికి చెందిన అనిల్ తన కారులో వ్యక్తిగత పనుల నిమిత్తం కుమార్తెతో కలిసి బయలుదేరాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఏలూరు రోడ్డులో గుణదల వద్దకు వచ్చే సరికి ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పిగా ఉందని కుమార్తెకు చెప్పాడు. రామవరప్పాడు రింగ్ రోడ్డుకు చేరుకునే సరికి నొప్పి తీవ్రమై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఓ ద్విచక్రవాహనాన్ని సైతం ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ప్రేమ్ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడగా, వాహనం నుజ్జునుజ్జయింది. గుండె నొప్పితో బాధపడుతున్న అనిల్‌ను ఆయన కుమార్తె స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. నడిరోడ్డు పై కారు, ద్విచక్రవాహన పెద్ద శబ్దంతో ఢీకొనడంతో స్థానికులు భయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రోడ్డులో ట్రాఫిక్ జామైంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. జేసీబీ సాయంతో కారును పక్కకు తొలగించారు. బాధితుడు ప్రేమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
వైద్య విద్యార్థి జ్ఞాపకార్థం గోల్డ్‌మెడల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాళహస్తికి చెందిన లిఖిత్ సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఏటా అనాటమీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థికి లిఖిత్ సాయి జ్ఞాపకార్థం గోల్డ్‌మెడల్ అందించేందుకు అతని తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా లిఖిత్‌సాయి తల్లిదండ్రులు స్పాన్సర్‌షిప్ లేఖను ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కుమారు డిని కోల్పోయి తీవ్ర విషాదంలోనూ సమాజానికి ఉపయోగపడేలా గోల్డ్ మెడల్ ప్రదానం చేసేందుకు ముందుకొచ్చిన లిఖిత్ సాయి తల్లిదండ్రుల ఉదాత్త నిర్ణయాన్ని అభినందించారు. వ్యక్తిగత దుఃఖాన్ని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే శాశ్వత వారసత్వంగా మార్చిన ఈ సేవాభావం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ చిత్ర, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శారదాంబ తదితరులు పాల్గొన్నారు.


