పలు హోటళ్లలో ఆహారం కల్తీ మయం అధికారుల తనిఖీల్లో వెలుగు చూసిన నిజం ఎన్టీఆర్ జిల్లాలో 16 హోటళ్లు, బేకరీలకు జరిమానాలు
లబ్బీపేట(విజయవాడతూర్ఫు): వారాంతాల్లో కుటుంబ సమేతంగా బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాటిలో లంచ్, డిన్నర్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. అంతే కాదు సాయంత్రం అయితే చాలు బయట ఆహారం తినేందుకే ఇప్పటి జనరేషన్ ప్రాధాన్యం ఇస్తోంది. ఉన్నత వర్గాలకు చెందిన వారు సైతం రోడ్డు పక్కన ఫుడ్ తినడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని పలు రెస్టారెంట్‌లు, హోటళ్లు, బేకరీలపై జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన తనిఖీలు ఎన్నో చేదువాస్తవాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల ఆకస్మికంగా, మరికొన్ని చోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 16 చోట్ల ఆహారం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, అపరిశుభ్రమైన పరిసరాలు, హానికరమైన వాతావరణం ఉన్నా యని గుర్తించారు. ఆయా రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులపై ఈ నెల 27న జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.5.65 లక్షల జరిమానాలు విధించారు.
జరిమానాలు ఇలా..
అపరిశుభ్ర పరిసరాలు, హానికర వాతావరణంలో వ్యాపారం చేస్తున్నారంటూ విజయవాడ ప్రకాశం రోడ్డులోని రామయ్య మెస్‌కు రూ.లక్ష, కళానగర్ లోని యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్‌కు రూ.75 వేలు, బిస్మిల్లా బిర్యానీ (పీవీపీ రోడ్డు)కి రూ.10 వేలు, వత్సవాయిలోని శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి హోటల్‌కు రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు కలిగి ఉన్నందుకు విజయవాడ కబేళా దగ్గర జీఎం ఫుడ్ ప్రొడక్స్‌కు రూ.50 వేలు, గులాబీ తోట మోడరన్ ఫుడ్స్‌కు రూ.50 వేలు, బెంజిసర్కిల్ వద్ద నుంచి క్విక్ బాక్స్ రిటైల్ సర్వీస్ (స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్)కు రూ.75 వేలు, లబ్బీపేటలోని ఫుడ్ రిపబ్లిక్‌కు రూ.75 వేలు, ఆటోనగర్ సుభానీ హోటల్‌కు రూ.25 వేల చొప్పున జరిమానాలు విధించారు. వీటితో పాటు మరి కొన్ని ఆహార కేంద్రాలకు ఫుడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నందుకు జరిమానాలు విధించారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
రంగు రుచి కోసం కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీల్లో సింథటిక్ కలర్లను మితిమీరి వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఫుడ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. అలాంటి ఆహారం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటి కల్తీ ఆహారం తినే వారిలో పేగు పూతలు, సరిగ్గా జీర్ణం కాకపో వడం, గ్యాస్టైటీస్, ఇన్‌ఫ్లమేటరీ పేగు వ్యాధి (ఐడీబీ), వాంతులు, విరేచనాలు వంటివి రావచ్చంటున్నారు. దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


