భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యం

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

● 22ఏ జాబితా అర్జీల పరిష్కారానికి కృషి ● ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

● 22ఏ జాబితా అర్జీల పరిష్కారానికి కృషి ● ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో భూ వివాద రహిత గ్రామాలే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. 22(ఏ) జాబితాకు సంబంధించి వచ్చిన అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 180 అర్జీలను పరిష్కరించామని తెలిపారు. కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియతో కలిసి 22–ఏ నిషేధిత భూముల జాబితాలో పొరపాటున నమోదైన కొందరు పట్టాదారులకు సంబంధించిన ప్రైవేటు భూములను ఆ జాబితా నుంచి తొలగింపు ఉత్తర్వులను కలెక్టర్‌ లక్ష్మీశ సోమ వారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించినట్లు తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లో వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సరైన విధివిధానాలు పాటించకుండా 22ఏ జాబితాలో చేర్చిన భూములకు ఆ జాబితా నుంచి ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ సమీక్ష నిర్వహిస్తున్నారని, వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అందుకు కారణాలను విశ్లేషిస్తున్నారని వివరించారు. పరిష్కరించి రిజిస్ట్రేషన్‌కు వీలుకల్పించిన దరఖాస్తుల్లో ఐదు నుంచి 15 ఏళ్లపాటు సైతం అపరిష్కృతంగా ఉన్నవి కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దేవదాయ శాఖకు చెందని భూములు కూడా పొరపాటున 22ఏలో నమోదైనన సందర్భాల్లో దేవదాయ శాఖ కమిషనర్‌ నివేదికను అనుసరించి 22ఏ జాబితా నుంచి తొలగింపు ప్రక్రియ చేపట్టామన్నారు. ఏపీఐఐసీ భూముల విషయంలో కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, సంబంధిత పత్రాల ధ్రువీకరణ అనంతరం అర్హమైన కేసులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వేతో పాటు కలెక్టరేట్‌ సెక్షన్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement