గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమం వద్ద డ్రెడ్జింగ్ పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇన్‌లాండ్ వాటర్ వేస్ అఽథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో పాటు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, లంకె అంకమోహనరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లమోతు ప్రకాష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లమోతు దయాకర్ మాట్లాడుతూ.. పవిత్ర సంగమం వద్ద ఇసుక మాఫియా డ్రెడ్జింగ్ చేసి కృష్ణానదీ గర్భాన్ని కొల్లగొడుతోందన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగుతోందన్నారు. ఫంటు పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. ఇక్కడ నుంచి భారీ వాహనాల్లో ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మైనింగ్, ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం చేపడతామన్నారు.
జేసీకి పిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు


