ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. విజయవాడ కానూరుకు చెందిన కొండవీటి ఈశ్వరరావు, మాధవి దంపతులు రూ. 5 లక్షలు వెచ్చించి బంగారు బొట్టు, బులాకి, నత్తులను తయారు చేయించారు. బంగారు ఆభరణాలను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ (ఎన్‌సీసీ, క్యాప్, ఆంగ్లో ఇండియన్స్, దివ్యాంగులు) ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో సోమవారం నుంచి మొదలుకానుంది. సోమవారం ఎన్‌సీసీ, చిల్డ్రన్స్ ఫర్ ఆర్మ్‌డ్ పర్సన్స్ (క్యాప్) కేటగిరీకి చెందిన వారికి 1 నుంచి 60 వేల ర్యాంకు వరకు, దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్స్ వారికి మొదటినుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. మంగళవారం క్యాప్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 60,001 నుంచి చివర ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గౌడ్స్ అభ్యర్థులకు మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ విజయసారథి తెలిపారు. పరిశీలన పూర్తైన జనరల్ కేటగిరి అభ్యర్థులు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు.
గుడివాడటౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 11వ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం జరిగాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 200 మంది పైగా క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ప్రతినెలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయన్నారు. క్రీడలను ప్రోత్సహించి యువ క్రీడాకారులను తయారుచేసే కార్ఖానాగా స్టేడియం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, కమిటీ సభ్యులు ప్రవీణ్‌కుమార్, జైన్, ఎం.లక్ష్మణరావు, పి.వెంకట్రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విజేతలకు గుడివాడ డీఎస్పీ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం జరగనుంది. ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూల వాహనంపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్లు, దేవస్థాన ప్రచార రథంపై కొలువై ఉన్న మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు.


