భారీలోడుతో ఇసుక, కంకర రవాణా కన్నెత్తి చూడని అధికారులు భయంతో వణికిపోతున్న ప్రజలు
కంకిపాడు: మమ్మల్ని ఆపేదెవరు అనుకుంటూ అధిక లోడుతో ఇసుక, కంకర లారీలు, ట్రాక్టర్లు రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. వాహన దారులు నిబంధనలను గాలికొదిలేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వాహనాలు ప్రధాన రోడ్లపై యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నా అధికారులు ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారు. ప్రజలు మాత్రం ప్రమాదాల భయంతో ఆందోళన చెందుతున్నారు.
రక్షణ చర్యలు సున్నా
పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లోని గ్రామాలకు ఇసుక, కంకర లోడు వాహనాలు భారీగా వెళ్తున్నాయి. ప్రధానంగా కరకట్ట వెంట ఉన్న ఇసుక స్టాక్‌యార్డుల నుంచి నిత్యం వందల సంఖ్యలో హెవీ లోడు లారీలు, ట్రాక్టర్లులో ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల పరిమితికి మించి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. రవాణా సమయంలో ఇసుక గాల్లో లేచి వాహనచోదకులపై పడి గమ్యస్థానాలకు చేరే సమయంలో చిన్న చిన్న ప్రమాదాల బారిన పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక జారకుండా, గాలికి ఎగిరి వాహనదారుల కళ్లలో పడకుండా రక్షణ చర్యలు తీసు కోవాలి. కనీసం ఇసుక, కంకర వాహనాలను పూర్తిగా కమ్ముతూ పరదాలు కప్పటం లేదు. దీంతో సమస్య జఠిలమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని క్వారీల నుంచి కంకర లోళ్లు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఇవి కూడా పరిమితికి మించి లోడింగ్ చేయించుకుని రోడ్లపై సంచరిస్తున్నాయి.
ఆందోళనలో ప్రజలు
రోడ్లపై జారిపడుతున్న ఇసుక, కంకర, మట్టితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం ప్రమాదం అంచున జీవనం సాగుతుండటంతో భయంతో వణికిపోతున్నారు. రోడ్డు మార్జిన్లలో పేరుకుపోతున్న ఇసుక, వ్యర్థాలను శుభ్రం చేయడంలో స్థానిక సంస్థలు అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్న దుస్థితి.
స్పందన లేని అధికారులు
పరిమితికి మించి రవాణా అవుతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదు. గతంలో అడ్డగోలు రవాణాకు తనిఖీలతో బ్రేక్ పడేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను అడ్డుకోవడం, జరిమానాలు విధించడం జరగటం లేదు. ఫలితంగా అధిక లోడుతో వాహనాలను రోడ్లపై దర్జాగా నడిపించేస్తున్నారు.


