గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ఏపీ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గ్రంథాలయాల సందర్శన యాత్ర జరిగింది. తొలుత ఈ బస్సు యాత్రను సివిల్‌ కోర్టుల సమీపంలోని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ గ్రంథాలయం వద్ద కలెక్టర్‌ లక్ష్మీశ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఏపీ రచయితల సంఘం ఇటువంటి యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. వీబీఎఫ్‌ఎస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రచయితల సంఘం ఉపాధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతిలో అతిపెద్ద సెంట్రల్‌ లైబ్రరీ నిర్మాణ పనులకు జూలైలో శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జి.వి.పూర్ణ చంద్‌, సాహితీ వేత్తలు గుమ్మా సాంబశివరావు, వేముల హజరత్తయ్య గుప్తా, విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు. యాత్ర ఉద్దేశాలను రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్‌ సభకు వివరించారు. ఈ సందర్భంగా చెన్నాప్రగడ శర్మ రచించిన కవిత్వం కురిసింది కవితా సంకలనం, ఎం.ఎన్‌.వి. ప్రసాద్‌ రచించిన ఆవకాయ్‌ శతకం, ఎస్‌.ఆర్‌. పృథ్వి రచన ఆరుద్ర సప్తతి ఉత్సవం పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం బస్సుల్లో కవులు, రచయితలు బయలు దేరి నగరంలోని ఠాగూర్‌ గ్రంథాలయం, రామ్మోహన్‌ లైబ్రరీ, హనుమంతరాయ గ్రంథాలయం, సర్వోత్తమ గ్రంథాలయాలను సందర్శించి వాటి విశిష్టతలను, అక్కడ పుస్తకాలను పరిశీలించారు. సంఘం తరఫున ప్రభుత్వ ఉగాది పురస్కార విజేత దుర్గాప్రసాద్‌ను సత్కరించారు. సంఘ ప్రతినిధులు నానా, సోమేపల్లి వశిష్ట, శర్మ సీహెచ్‌, రాజశేఖర్‌, పుష్పాదేవి, లక్ష్మీ సుజాత, సుధారాణి తదితరులు పర్యవేక్షించారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement