ఆటోవాలానే ఆర్గనైజర్ రోజుకు రెండు షోలు ఎంట్రీ ఫీజు రూ.వెయ్యి, కనీస పందెం రూ.10 వేలు పట్టించుకోని పోలీస్ యంత్రాంగం
కోనేరుసెంటర్: నగరంలో అతనో సాదాసీదా ఆటో డ్రైవర్.. రోజూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే అతి సాధారణ వ్యక్తి... అయితే ఇదంతా కేవలం పైకి కనిపించే ముసుగు మాత్రమే... ఆ ఆటో డ్రైవర్ దినచర్య లోతుగా వెళ్లి పరిశీలిస్తే అతనో పేకాట కింగ్. అవును.. బందరులో ఇప్పుడు ఓ ఆటో వాలానే లీడర్‌గా సాగిస్తున్న పేకాట శిబిరం జిల్లాలోని పేకాటరాయుళ్లలో హాట్‌టాపిక్‌గా మారింది. చట్టాన్ని తన చుట్టంగా మార్చుకున్నాడో లేదంటే అధికార పార్టీ నేతలను తనకు అండగా పెట్టుకున్నాడో తెలీదు గానీ అతని పేకాట శిబిరం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్ర మంత్రి ఇలాకాలో ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో పేకాట జోరుగా సాగుతోంది.
మూడు పువ్వులు.. ఆరు కాయలు..
ఈ పేకాట శిబిరం ఏదో సాదాసీదాగా సాగుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. హై–ప్రొఫైల్ జూదరులను ఆకర్షించేలా ఈ శిబిరం సాగుతోందనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ ఆటలో అడుగు పెట్టాలంటేనే కళ్లు బైర్లు గమ్మే రూల్స్ ఉన్నాయి. ఆటలో కూర్చోవాలంటే పందెం రాయుళ్ల నుంచి (ఎంట్రీ ఫీజు) రూ.వెయ్యి నిర్వాహకుడు (ఆటో వాలా) ముక్కు పిండీ వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రోజుకు లక్షలాది రూపాయలు చేతులు మారే ఈ జూద శిబిరానికి బందరుకు చెందిన పేకాటరాయుళ్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ రకాల వ్యాపారవేత్తలు, ఇతర సంపన్నులతో పాటు పలువురు ఉద్యోగులు సైతం వస్తుండటం గమనార్హం. దీంతో నిర్వాహకుడి సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఆటగాళ్ల నుంచి ఒక్కో షోకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్న నిర్వాహకుడు అదే స్థాయిలో పందెం కట్టాలంటే రూ.10 వేలకు తగ్గకూడదనే ఆంక్షల మీద పేకాట నిర్వహిస్తున్నాడు. దీంతో ఈ ఆటలో ప్రతి రోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.
పోలీసులపై ఆరోపణలు..
నగర నడిబొడ్డు అదీ కాకుండా ఓ రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి ఇంటికి సమీపంలో ఇంత పెద్ద ఎత్తున జూదం జరుగుతున్నా సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అలాగే నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా పట్టించుకోకపోవడం, పోలీసులు ఈ శిబిరం వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న అంతర్యమేంటో అర్థం కావటంలేదంటూ నగర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత పోలీసులకు నిర్వాహకుడి నుంచి రోజువారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ఆటో వాలా ముసుగులో ఉన్న ఆర్గనైజర్ వెనుక రాజకీయంగా ఏవో పెద్ద తలకాయలే ఉండి పోలీసులను మేనేజ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికై నా స్పందించి దాడి చేస్తారా లేక ప్రజాభిప్రాయానికి తలొగ్గి తప్పు ఒప్పుకుంటారో వేచిచూడాలి.
మంత్రి ఇంటికి
సమీపంలోనే శిబిరం..
అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే. ఈ పేకాట శిబిరాన్ని ఎక్కడో అడవుల్లోనో... నిర్మానుష్య ప్రాంతాల్లోనో నిర్వహించడం లేదు. ఏకంగా రాష్ట్ర మంత్రి ఇంటికి అతి సమీపంలో పేకాట శిబిరం కొన్ని నెలల నుంచి యథేచ్ఛగా కొనసాగుతుండటం అందరినీ అవాకై ్కయ్యేలా చేస్తుంది. ‘దీపం కిందే చీకటి’ అన్నట్లు రాష్ట్ర మంత్రి ఇల్లు పక్కనే ఉన్నా భయం లేకుండా ఇంత పెద్ద పేకాట శిబిరాన్ని ఓ సామాన్య ఆటోవాలా (హౌస్ గ్యాంబ్లింగ్) నడుపుతుండటం వెనుక ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకుంటే ఓ సామాన్య ఆటోడ్రైవర్ నగర నడిబొడ్డున ఇంతటి సాహసానికి ఒడిగట్టటం జరగదంటూ నగరవాసులు చెప్పుకుంటున్నారు.


