ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు తెనాలి మారీస్‌పేటకు చెందిన అట్లూరి బాపూజీ కుటుంబం రూ.2,01,116 విరాళాన్ని అందజేసింది. అమ్మవారి అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన రవీంద్రభారతి విద్యా సంస్థల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ కుటుంబం రూ.1,11,111ల విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు.
కొండపల్లిలో
మాల్దీవుల బృందం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మాల్దీవుల గణతంత్ర దేశానికి చెందిన 33 మంది సభ్యుల బృందం ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పర్యటించింది. కొండపల్లిలో వారసత్వ సంపద ప్రాంతాలను సందర్శించింది. కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను బృంద సభ్యులు పరిశీలించారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్డీపీఆర్ సంస్థ ఈ బృందానికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ విధానం, వికేంద్రీకృత పాలనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు జూన్ 28 నుంచి 30 వరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో ఈ బృందం పర్యటిస్తోంది. సోమవారం గుంటుపల్లిలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీ, బాల సభ, మహిళా సభ, పంచాయతీ అధికారులతో సమావేశాలు జరుపుతారు. మంగళవారం జుపూడి గ్రామ పంచాయతీలోని ఎస్‌డబ్ల్యూ పీసీ షెడ్ సందర్శన అనంతరం అధికారులతో చర్చిస్తారని ఎంపీడీఓ శకుంతల తెలిపారు.
బందరు కాలువలో
పడి బాలుడు మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రమాదవశాత్తు బందరు కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లబ్బీపేట, ఫకీర్‌గూడెంలో బందరు కాలువ సమీపంలో ఎండీ వజీర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతను కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా అతని భార్య ఆయేషా ఓ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. వీరికి కుమారుడు సబీర్(7), కుమార్తె సోఫియా జైన్(6) ఉన్నారు. సబీర్ రెండో తరగతి చదువుతుండగా సోఫియా ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఆదివారం మధ్యాహ్నం అన్నాచెల్లెలిద్దరు ఆడుకోవడానికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బందరు కాలువ ఒడ్డుకు చేరుకున్నారు. కాలువ మెట్ల మీద ఆడుకుంటుండగా సోఫియా నీటిలోకి జారిపోయింది. పక్కనే ఉన్న సబీర్ తన చెల్లిని గమనించి నీటి నుంచి పైకి తోసి ప్రమాదవశాత్తు అతను నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికీ కనిపించకపోవడంతో సోఫియా తన ఇంటికి వెళ్లి కాలువలో మునిగి అన్న కనిపించడం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు ఘటనా స్థలానికి వెళ్లి చూసి తన కుమారుడు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు బందరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మునిగిన ప్రాంతంలోనే సబీర్‌ను గుర్తించి పైకి తీసుకొచ్చారు. అతనిని పరీక్షించి చూసి మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
ప్రత్యర్థుల దాడిలో
గాయపడిన వ్యక్తి మృతి
గంపలగూడెం: తునికిపాడు గ్రామంలో ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన వేల్పుల బిక్షాలు(55) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 23న పొలం గట్టు విషయంలో బిక్షాలు అతని తమ్ముడు వరసైన వేల్పుల వెంకటేశ్వరరావుల మధ్య ఘర్షణ జరిగింది. దీనిని పురస్కరించుకొని 24న ఉదయం వేల్పుల వెంకటేశ్వరరావు కుమారులు గోపి, ఆజయ్‌కుమార్‌లతో పాటు అనిల్, చిన్నికృష్ణ, చిట్టిబాబులు రోకలిబండ, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. క్షతగాత్రుడిని ఖమ్మం ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గిరిబాబు తెలిపారు.


