పేరుపాలెం బీచ్‌లో విషాదం | - | Sakshi
Sakshi News home page

పేరుపాలెం బీచ్‌లో విషాదం

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

● స్నానానికి దిగి యువకుడు మృతి ● మరో విద్యార్థి గల్లంతు

● స్నానానికి దిగి యువకుడు మృతి ● మరో విద్యార్థి గల్లంతు

నరసాపురంరూరల్‌: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగి ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో పాలిటెక్నిక్‌ విద్యార్థి అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షనన్‌కు చెందిన జిజ్జువరపు ఉమామహేశ్వరరావు (26) తన స్నేహితులతో కలిసి ఆదివారం సరదాగా గడిపేందుకు పేరుపాలెం బీచ్‌కు వచ్చాడు. అందరూ కలిసి సముద్రంలో స్నానానికి దిగగా, ప్రమాదవశాత్తు ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. మృతుడి తండ్రి ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీచ్‌లో లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే బీచ్‌లో జరిగిన మరో ప్రమాదంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామానికి చెందిన సీహెచ్‌ సుభాష్‌ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ నాగరాజు గాలింపు చర్యలు చేపట్టారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి

రాజీలేని పోరాటం

గన్నవరం: జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాజీలేని పోరాటాలు సాగిస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వెంకట్రావు తెలిపారు. స్థానిక రోటరీ ఆడిటోరియంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ వర్కంగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌(ఏపీడబ్ల్యూజేఎఫ్‌), ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌కాస్టు జర్నలిస్టు అసోసియేషన్‌(ఏపీబీజేఏ) జిల్లా కమిటీల మహాసభ నిర్వహించారు. వెంకట్రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీబీజేఎ రాష్ట్ర కన్వీనర్‌ వీసం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జర్నలిస్టులపై దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అమరావతి ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి చిగురుపాటి సతీష్‌బాబు కోరారు. తొలుత ఫెడరేషన్‌ జెండాను సీనియర్‌ పాత్రికేయుడు ఉడతా రామకృష్ణ ఎగురవేశారు. ఎంపీపీ అనగాని రవి, ఫెడరేషన్‌ నాయకులు వెలమా రామారావు, షేక్‌ ఖాజావలి, వల్లభనేని సురేష్‌, ఎంబీ నాథన్‌, ఎన్‌.శ్రీనివాసరావు, హలీమ్‌, ఎం.రామారావు, కళ్లం వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ రామచంద్రజోషి పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా దొండపాటి ఉదయ్‌కుమార్‌, కార్యదర్శిగా జొన్నా రవిశంకర్‌, గౌరవ అధ్యక్షుడిగా ఉడతా రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాస్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, చిట్టిబాబు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా బి.రమేష్‌, పి.వేణుగోపాలస్వామి, కోటయ్య, ఇంద్రగంటి గోపికృష్ణ, కోశాధికారి అచ్యుతరావు, మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

నేషనల్‌ ఐస్‌ స్కేటింగ్‌ పోటీల్లో చైత్ర దీపికకు కాంస్యం

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): డెహ్రాడూన్‌లో జరుగుతున్న 21వ నేషనల్‌ ఐస్‌ స్కేటింగ్‌ చాంపియ న్‌షిప్‌ పోటీల్లో నగరానికి చెందిన క్రీడాకారిణి పెదిరెడ్ల చైత్రదీపిక ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ చాంపియన్‌ షిప్‌లో ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన చైత్రదీపిక ఆదివారం జరిగిన ఐస్‌ ఫిగర్‌ స్కేటింగ్‌ కేటగిరీ–7 విభాగంలో ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. జాతీయ స్థాయి ఐస్‌ స్కేటింగ్‌ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు పతకం పొందడం ఇదే మొదటి సారి. ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌, ఐస్‌ స్కేటింగ్‌ విభాగాల్లో ఏకంగా 62 పతకాలను ఇప్పటి వరకు చైత్రదీపిక సాధించింది. చైత్రదీపికను నగరంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement