మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
రేపల్లె/చల్లపల్లి/కోడూరు: బాపట్ల జిల్లా రేపల్లె–పెనుమూడి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇరాలి గ్రామానికి చెందిన గంజాల బాపనయ్య తన భార్య నాంచారమ్మ, కుమారుడు సంతోష్ కుమార్‌లతో కలిసి తన ద్విచక్ర వాహనంపై రేపల్లె వైపు వస్తున్నాడు.
పనులకు వెళ్లి వస్తుండగా..
చల్లపల్లి మండలం, లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన కాకి రాకేష్(27) ప్రకాష్‌ల ద్విచక్ర వాహనం రేపల్లె నుంచి కృష్ణా జిల్లా వైపు వస్తున్నారు. పెనుమూడి రోడ్డులోని టపాసులగూడం వద్ద వీరు బాపనయ్య వాహనాన్ని ఢీకొన్నారు. బాపనయ్య, కాకి రాకేష్ (27) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాంచారమ్మ, సంతోష్ కుమార్, ప్రకాష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్ కాంక్రీటు పనులు చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఆదివారం రేపల్లె నుంచి పనులు ముగించుకుని వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించినట్లు సమాచారం. వీరి మృతితో లక్ష్మీపురం, ఇరాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బి.అశోక్‌కుమార్ తెలిపారు.


