పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం వద్ద ప్రమాదం ఆర్టీసీ బస్సు ఢీకొని వాహనాల పార్కింగ్ నగదు వసూలు చేసే వ్యక్తి మృతి
పెనుగంచిప్రోలు: బతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందిన ఘటన స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం వత్సవాయి మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన అలగండుల సతీష్‌కుమార్(41) ఆలయం వద్ద వాహనాల పార్కింగ్‌కు సంబంధించి రుసుం వసూలు చేసే పనిలో రెండు రోజుల క్రితం చేరాడు. భార్య మాధవి కూడా కొంతకాలంగా ఆలయం వద్ద పొంగళ్ల షెడ్డులో పని చేస్తోంది. ఈక్రమంలో సతీష్‌కుమార్ పార్కింగ్ రుసుం వసూలు చేస్తూ ఆలయ ప్రవేశద్వారం పిల్లర్ వద్ద ఉండగా ఎదురుగా వచ్చిస జగ్గయ్యపేట ఆర్టీసీ బస్సు ఢీకొనగా బస్సు, పిల్లర్‌కు మధ్య ఇరుక్కుని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇటీవలనే వివాహం అయినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని చూసి భార్య మాధవి బోరున విలపించిన తీరు అందరినీ కలచి వేసింది.
కుంచించుకు పోయిన రహదారి..
తిరుపతమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారి పోలీస్‌స్టేషన్ సెంటర్ నుంచి ఆక్రమణలతో కుంచించుకు పోయింది. రోడ్డుకు రెండు వైపులా అసలే ఇరుకుగా ఉండే రహదారిపైనే వ్యాపారులు బండ్లు, బల్లలు, కుండల వ్యాపారాలతో పాటు కోళ్లు విక్రయాలు చేస్తుండటంతో రహదారిపై ఎదురెదురుగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు మరీ ముఖ్యంగా ఆలయం వద్ద వాహనాల పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేసుకునే హక్కు పొందిన కాంట్రాక్టర్ వాహనాలు రోడ్డు మీద పెట్టి డబ్బులు వసూలు చేస్తుండటంతో ట్రాఫిక్‌తో నిలిచిపోతుంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.


