ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులు, యాత్రికులతో ఆదివారం తెల్లవారుజాము నుంచి రద్దీ కనిపించింది. ఉదయం 7 గంటల నుంచి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మరో వైపున అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం జరిగిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. అంతరాలయ దర్శనం రద్దు చేయడంతో భక్తులు రూ.300 టికెట్లు కొనుగోలు చేసి బంగారు వాకిలి ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ డీఈవో కిశోర్‌కుమార్ పర్యవేక్షణలో ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్‌బాబులు క్యూలైన్లను పర్యవేక్షించారు. మహా నివేదన అనంతరం రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత రూ. 500 టికెట్లను తిరిగి విక్రయించారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయమే ఆలయానికి చేరుకున్న భక్తులు సైతం మధ్యాహ్నం వరకు వేచి ఉండి, అంతరాలయ దర్శనం చేసుకోవడం విశేషం.


