కేసును నీరుగార్చే కుట్ర
అజ్ఞాతంలోకి పంపి డ్రామా
● మాజీ సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను విచారణ చేస్తున్న సిట్
● క్రాంతికుమార్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో మిస్టరీ మాత్రం వీడటం లేదు. శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించిన ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఆయన అరెస్టు అయిన రోజే పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఏసీపీ మానస, సీఐ మురళీకృష్ణతో పాటు సిట్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటి వెళ్లి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. పరిసరాల్లో సీసీ పుటేజిని పరిశీలించారు.
బెంగళూరు, హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాలు
హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిల కోసం బెంగళూరు, హెదరాబాద్‌కు ప్రత్యేక బృందాలను పంపి గాలిస్తున్నారు. మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్‌ను, ఓ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అతని నుంచి కీలక సమాచారాన్ని సిట్ పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్ బృందం సైతం మాజీ సీఐ నాగ రాజుతో పాటు, ఈ ముగ్గురే కేసులో భాగస్వామ్యమయ్యారు అనే రీతిలో ఆధారాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ నలుగురిపైనే కేసు పెట్టి, మిగతా సూత్రధారులను, పాత్రధారులను సురక్షితంగా తప్పించే విధంగా సిట్ దర్యాప్తు సాగుతోంది.
సాంకేతిక ఆధారాల సేకరణపై..
శవాన్ని ఎలా మాయం చేశారనే డిక్లరేషన్‌ను ఈ నెల 29 తేదీ హైకోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోర్టుకు ఏ విధమైన నివేదిక సమర్పించాల్సి, అందుకోసం అవసరమైన సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించే దిశగా సిట్ ప్రయత్నిస్తోంది. మే 6వ తేదీ మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చినట్లు పోలీసులు స్పష్టత ఇచ్చారు. లాకప్‌లో ఉండగా ఓ ఎస్‌ఐ చూశారని, బాధితుడి తల్లి విజయలక్ష్మి మా అబ్బాయిని కొడుతుంటే కేకలు వినిపించాయని, రెండు కాళ్లు కట్టి పడేయటం చూశానని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్ బృందం సాయికృష్ణ లాకప్‌డెత్ అయ్యారని స్పష్టత ఇచ్చారు.
మిస్టరీ వీడే దిశగా కొనసాగని సిట్ దర్యాప్తు
శవాన్ని ఎలా మాయం చేశారు.. సాయికృష్ణను ఎందుకు తెచ్చారనే మిస్టరీ వీడే దిశగా మాత్రం సిట్ దర్యాప్తు సాగడం లేదు. తూతూ మంత్రంగా కంటి తుడుపు దర్యాప్తుతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో మాజీ సీఐ సీఐ నాగరాజుతో పాటు, పలువురి ప్రభుత్వ, పోలీసు పెద్దల హస్తం ఉండటంతో, నాగరాజుకే పరిమితం చేసి, వీరిందని పక్కాప్రణాళికతో కరకట్ట ప్యాలెస్ కనుసన్నల్లో తప్పించే కుట్ర సాగుతుందనేది స్పష్టం అవుతోంది.
క్రాంతికుమార్ కేసుపై దర్యాప్తు..
మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా ఏసీపీ సత్యానందంను నియమించారు.
ఆయన శనివారం సాయంత్రం పేరుపోగు క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి. అతని తండ్రి, భార్య, కుటుంబసభ్యులను విచారణ చేశారు. ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు రావాలని క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావును కోరారు. దళిత సంఘాలు, న్యాయవాదుల సలహా తీసుకొని పోలీసు విచారణకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రాంతికుమార్‌తో సన్నిహితంగా మెలిగిన, సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్‌ను కూడా విచారణ చేసినట్లు సమాచారం.
కరకట్ట ప్యాలెస్ కనుసన్నల్లో సాగుతున్న దర్యాప్తును, ఏకంగా పోలీసు బాసే పర్యవేక్షిస్తూ, కేసును నీరుగార్చే కుట్రకు తెరలేపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే మాజీ సీఐ నాగరాజుపై కేసు నమోదు అయిన వెంటనే ఆయన పారిపోకుండా సర్వెలెన్స్ పోలీసులను ఏర్పాటు చేశారు. అయితే కీలకంగా నాగరాజుకు సహకరించింది కానిస్టేబుల్స్ ఇద్దరే అని, వీరితో పాటు మరికొంత మంది పాత్ర ఉందని బాధితుడి తల్లి విజయలక్ష్మి, బంధువులు ఫిర్యాదు చేశారు. అయినా వీరిపై మాత్రం పోలీసులు నిఘా పెట్టలేదు. పోలీసుబాస్‌లే వీరిని బయటికి పంపించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిజాలు వెలుగులోకి రాకుండా వారి ఇద్దరిని పోలీసు పెద్దలే అజ్ఞాతంలోకి పంపి డ్రామా ఆడుతున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భావనతో, పోలీసు పెద్దలే ఈ డ్రామాకు తెరలేపారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకోవడం పెద్ద కష్టం కాకపోయినా, కేసును సాగదీసి, కాలయాపన చేసే విధంగా దర్యాప్తు సాగుతోంది. పోలీసు పెద్దలను తప్పించి, చిన్న చేపలకు గాలం వేసి పట్టుకొని మమ అని పించే రీతిలో సిట్ దర్యాప్తు చేస్తోందనే భావన పలువురిలో వ్యక్తం అవుతోంది.


