గన్నవరం: స్థానిక సబ్‌జైలును శనివారం జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.గోపి సందర్శించారు. సబ్‌జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.వరలక్ష్మితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి గోపి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సబ్‌జైలును సందర్శించినట్లు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా సబ్ జైలులో ఖైదీలకు వసతులను కల్పించడంతో పాటు అవసరమైన వైద్య సేవలందించాలని తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.గాయత్రి, జైలు సూపరింటెండెంట్ బి.రాంబాబు, జైలు విజిటింగ్ లాయర్ ఎల్.భగీరథి, పలువురు కోర్టు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడ రూరల్: పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగితే చర్యలు తీసుకోవచ్చని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ అన్నారు. విజయవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గత 6 నెలలుగా గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి మాడ్యుల్స్ ఇవ్వకపోవడంతో డీజల్ హెడ్‌లోనే పాత బకాయిలకు సంబంధించిన బిల్లులను పంచాయతీ అభివృద్ధి అధికారులు డ్రా చేశారన్నారు. ఎక్కడైనా నిధుల దుర్వినియోగం జరిగితే.. అందరిపై బురద చల్లడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.బసవలింగేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జి.నరసింహరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, గంగూరు కార్యదర్శి ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. ఈ ప్రక్రియను ఏపీ సాంకేతిక విద్యాశాఖ మొదటి సారిగా ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో చేపట్టింది. దీని కోసం నగరంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన వెంటనే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైనట్లుగా ఆన్‌లైన్‌లోనే సందేశం వస్తోంది. అలా రాని వారు మాత్రమే పాలిసెట్ కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు స్వయంగా వచ్చి వారి సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలి. నగరంలోని రమేష్ ఆస్ప రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాల, గుణదలలోని ఆంధ్రా లయోల కాలేజీ, మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ఆవరణలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇది పూర్తయిన వారికి మాత్రమే ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్ల ఎంపికకు అర్హత ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన వారు ఈ నెల 29 నుంచి జూలై 3 తేదీ లోపు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారఽథి చెప్పారు. జూలై 4వ తేదీ.. నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని, 6న సీట్ల కేటాయింపును ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. జూలె 7 నుంచి 10వ తేదీలోగా సీటు కేటాయించిన కళాశాలకు అభ్యర్థులు స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయన తెలియజేశారు.


