మరణంలోనూ తీరని గోడు | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ తీరని గోడు

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

ఊరు పొమ్మన్నా.. కాడి రమ్మనలేదు..!! కాటి రేవు నీటిపాలు.. కడసారి వీడ్కోలు పరాయిపాలు

చివరి మజిలీకి చిక్కులెన్నో పొరుగూళ్లో పూర్తి చేసిన దహన సంస్కారాలు

ఊరు పొమ్మన్నా.. కాడి రమ్మనలేదు..!!
కాటి రేవు నీటిపాలు.. కడసారి వీడ్కోలు పరాయిపాలు

కృత్తివెన్ను: మనిషి బతికున్నప్పుడు పడిన కష్టాలు చాలవన్నట్టు, కన్నుమూశాక కూడా ఆత్మశాంతికి నోచుకోని దైన్యం అది. ‘ఊపిరి పోయింది.. ఊరు పొమ్మంది.. కానీ కాటి నేల మాత్రం రమ్మనలేదు.’ ఆధునిక సమాజంలో చంద్రమండలానికి వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆఖరి మజిలీలో గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు ఆరడుగుల నేల కరువైంది. కృత్తివెన్ను మండలంలోని పీతలావ గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఓ ఘటన చూస్తే ఎవరికై నా కన్నీళ్లు ఆగవు.

సముద్రం పోటు.. వర్షం నీరు..

అంతిమయాత్రకు తీరని లోటు!

పీతలావ గ్రామంలో దాదాపు 140 ఇళ్లు, సుమారు 500 మంది జనాభా నివసిస్తున్నారు. దశాబ్దాలుగా వీరికి సరైన శ్మశాన వాటిక లేదు. ఊరి చివర ఉన్న పర్రభూమినే వీరు శ్మశానంగా వాడుకుంటున్నారు. అయితే సముద్రపు పోటు వచ్చినప్పుడల్లా, వర్షాలు కురిసినప్పుడల్లా ఆ కాస్తా భూమి జలమయమైపోతుంది. తాజాగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది. సరిగ్గా అదే సమయంలో గ్రామంలో ఒకరు మరణించారు. కడసారి చూపు చూసుకుని గుండెలవిసేలా ఏడుస్తున్న బంధువులకు, ఆ మృతదేహాన్ని ఎక్కడ దహనం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చూస్తే నీరు.. కళ్లల్లో అంతకంటే ఎక్కువ కన్నీరు.

పరాయి ఊరిలో ప్రయాసల మధ్య...

‘మా ఊరి నేల మా వాడిని సాగనంపడానికి చోటివ్వలేదు. బతికుండగా ఎలాగో అష్టకష్టాలు పడ్డాడు, పోయాక కూడా ఈ నరకమా?’ అంటూ మృతుడి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేక, పక్కనే ఉన్న కృత్తివెన్ను గ్రామస్తులను వారి కాటి రేవులో దహన సంస్కారాలు చేసుకోవడానికి అనుమతి కోరారు. ఆఖరికి, కన్నవారి చేతుల మీదుగా సాగాల్సిన అంతిమ సంస్కారాలు, పరాయి ఊరి శ్మశానంలో, అపరిచిత నేలపై అశ్రునయనాల మధ్య పూర్తి చేయాల్సి వచ్చింది. మృతదేహాన్ని మోసుకుంటూ వేరే గ్రామానికి తరలిస్తున్న ఆ దృశ్యం స్థానికులను తీవ్రంగా చలింపజేసింది.

పాలకులారా.. మా గోడు వినపడదా?

‘ఈ సమస్య ఈ రోజుది కాదు. పాలకులకు, అధికారులకు, స్థానిక శాసనసభ్యులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినే నాథుడే కరువయ్యాడు’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు, కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పే అధికారులు.. చనిపోయిన వారికి దక్కాల్సిన కనీస గౌరవాన్ని కూడా కల్పించలేకపోవడం శోచనీయం. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరవాలి. పీతలావ గ్రామస్తుల దశాబ్దాల గోడును ఆలకించి, భవిష్యత్తులో ఇలాంటి కన్నీటి గాథలు పునరావృతం కాకుండా తక్షణమే శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement