ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు | - | Sakshi
Sakshi News home page

ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

రామవరప్పాడు: యువత దేశాభివృద్ధికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచనలకు పదును పెట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దినోత్సవం సందర్భంగా ఎంఎస్‌ఎంఈ ఉత్సవ్‌ –2016ను ఎనికేపాడులోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో శనివారం ప్రారంభించారు.

ఈ ఉత్సవ్‌లో యువత, మహిళలు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులకు సంబంధించి 80కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఒక కుటుంబం– ఒక పారిశ్రామికవేత్త దార్శనికతకు అనుగుణంగా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా స్టార్టప్‌లకు చేయూతనిస్తున్నారన్నారు. యువ మేధస్సుకు అనుభవాన్ని జతచేసి ఆ ఆలోచనలను ఆవిష్కరణల వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర, వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధన దిశగా పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తుతున్నామన్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసుకుని తమ కాళ్లపై నిలబడుతూ మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికు ఎదిగేలా ఆర్టీఐహెచ్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో పాటు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ పి.భాస్కరరావు మాట్లాడుతూ దాదాపు వేలాది స్టార్టప్‌లు ఆర్టీఐహెచ్‌ ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇండస్ట్రీ 4.0 టెక్నికల్‌ సెషన్‌ నిర్వహించారు. 500 మందికి పైగా పారిశ్రామిక ప్రతినిధులు, సందర్శకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ దుర్గాప్రసాద్‌, జేఆర్‌డీ టాటా ఐలా చైర్మన్‌ టి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ఇ.మధు, ఆర్టీఐహెచ్‌ సీఈవో రవితేజ, ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరి రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement