ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర హోం మంత్రి అనిత గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం హోంమంత్రికి వేద పండి తులు ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకట రెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లా అండర్–19 ఉమెన్ క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తిచేశామని కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. కెప్టెన్‌గా మహమ్మద్ మెహాక్, సభ్యులుగా వి.అక్షయ, సీహెచ్.ధనశ్రీ, బి.స్రవంతి, టి.గుణచంద్రిక, పి.లక్ష్మీఅపర్ణ, బి.తమిళిక, ఆర్.చేతన ప్రియ, ఎం.సృజన, జె.ఎన్.ఎస్.ఎస్.యశశ్విని, జి.హరిణి, కె.హరిక, ఆర్.మానస యశోధ, కె.కీర్తి, ఆర్.ఇష్క్‌మయి, స్టాండ్‌బైగా సీహెచ్.గీతికాకృష్ణ, వి.దివ్యప్రియ, పి.సుమశ్రీ, పి.ఆనంద్ దీప్తి, కె.సిసిర, కె.మేఘనాసాయి, ఎస్.ఎస్. శ్రీకరిని ఎంపిక చేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్మార్ట్‌ఫోన్లు, టీవీలను పక్కన పెట్టి వేసవి సెలవుల్లో క్రీడామైదానాల వైపు చిన్నారులు, యువత చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ సూచించారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఆయన గురువారం ఉదయం సందర్శించారు. చిన్నారులతో కలిసి వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. పిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి వేసవి శిక్షణ శిబిరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు. డీఎస్‌డీఓ కె.కోటేశ్వరరావు, పలువురు కోచ్‌లు పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): మునిసిపల్ కమిషనర్లు వారంలో ఒక రోజు అన్న క్యాంటీన్లలో భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ కృష్ణలంకలోని రాణిగారితోట సాయిబాబా గుడి సమీపంలోని అన్న క్యాంటీన్‌ను ఆయన గురువారం మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో ఉన్న సదుపాయాలు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, తాగు నీటి ఏర్పాట్లను పరిశీలించారు. క్యాంటీన్‌లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్, కూలర్లు, దోమ తెరలు, ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వారిద్దరూ రూ.5 చొప్పున చెల్లించి టోకెన్లు తీసుకుని అందరితో కలిసి భోజనం చేశారు. ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యతపై అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు.


