గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. పర్యాటక, ఆర్కియాలజీ శాఖతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ కమిటీ భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మ్యూజియం దినోత్సవ కార్యక్రమాలపై కలెక్టర్ లక్ష్మీశ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘మ్యూజియమ్స్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్ థీమ్’తో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందన్నారు. 1887లో పునాది పడిన మన నగరంలోని బాపూ మ్యూజియాన్ని ఈ నెల 18న ఉచితంగా సందర్శించొచ్చని సూచించారు.
బాపూ మ్యూజియంలో రోజంతా ప్రత్యేకం:
18న ఉదయం బాపూ మ్యూజియంలో కల్చరల్ ఓపెనింగ్‌తో ప్రారంభమై మ్యూజియమ్స్ ఇన్ ది మోడర్న్ డేపై ప్రత్యేక చర్చలు, గైడెడ్ మ్యూజియం టూర్, విజయవాడ హెరిటేజ్ క్విజ్, దేశభక్తిని పెంపొందించేలా మ్యూజియం విశిష్టత చాటేలా లేజర్ షో వంటి కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. సాయంత్రం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జరిగే రూట్స్ రీలోడెడ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయని గీతామాధురి బృందంతో పాటు బ్యాండ్ సెహారీ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఆర్కియాలజీ డీడీ ఎం.రామసుబ్బారెడ్డి, ఏడీలు వెంకటరావు, నరసింహనాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధి వి.ఎంజసుధర్మ పాల్గొన్నారు.


