దుర్గమ్మ సన్నిధిలో అభివృద్ధి పనులకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో అభివృద్ధి పనులకు గ్రహణం

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

దుర్గమ్మ సన్నిధిలో అభివృద్ధి పనులకు గ్రహణం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకత సంతరించుకొంది. గతంలో పోల్చితే అమ్మవారి దర్శించుకొనే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజుకు 30వేల–40వేలు, శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు 70వేల–80వేల మంది భక్తులు అమ్మవారి దర్శించుకొంటున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో 15 రోజులకు రూ.కోటి నుంచి రూ.1.25 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం 15 రోజులకు రూ.2.5 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయితే అమ్మవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల కనీస సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. చంద్రబాబు సర్కారు అభివృద్ధి పనులపై దృష్టి సారించటం లేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం డిసెంబర్‌ 7, 2023లో దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా రూ.216.05 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఆ పనులు సైతం ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి.

ఎప్పటికి పూర్తవుతాయి?

దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా మహా మండపం ఎదురుగా రూ.26కోట్లతో అన్నప్రసాద భవనం, గోశాల వద్ద రూ.27 కోట్లతో లడ్డూ పోటు భవన నిర్మాణం పనులు సాగుతున్నాయి. గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో ఈ రెండు భవనాలలో ఆలయ అధికారులు పూజలు నిర్వహించి తాత్కాలికంగా అన్నదానం, లడ్డూ తయారీలను చేపట్టారు. డిసెంబర్‌లో నిర్వహించిన భవానీ దీక్ష విరమణల సమయంలోనూ వీటిని తాత్కాలికంగా వినియోగించారు. అయితే ఈ రెండు భవనాల నిర్మాణాలను పూర్తి స్థాయిలో మే నాటికి పూర్తి చేసి ఆషాఢం నాటికి అందుబాటులోకి తేస్తామని, అధికారులు చెప్పినా.. ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవటం లేదు.

లడ్డూ పోటు.. ఇంకెన్నాళ్లో?

ప్రస్తుతం బుద్దా వారి గుడి వెనుక భాగంలోని దేవస్థాన షెడ్డులో దేవస్థానం లడ్డూ తయారవుతోంది. దసరా, భవానీ దీక్ష విరమణల సమయంలో దీనికి అదనంగా కనక దుర్గానగర్‌లోని ఏనుగుల షెడ్డుతో పాటు నూతన భవనంలో లడ్డూ తయారీ చేస్తున్నారు. నూతన లడ్డూ పోటు అందుబాటులోకి వస్తే బుద్దా వారి గుడి సమీపంలోని లడ్డూ పోటును తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్సవాలలో ఆయా ప్రాంతాల్లో తయారు చేసిన లడ్డూలను కనకదుర్గానగర్‌లోకి ప్రసాదాల కౌంటర్లకు తరలించడం పెద్ద సమస్యగా మారుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో రవాణా సమస్య ఉత్పన్నమవుతోంది. కొత్త భవనం పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తే ఇది కొంత వరకూ పరిష్కారమవుతుంది.

సమీక్షలతోనే సరి!

దుర్గగుడిలో జరుగుతున్న మాస్టర్‌ ప్లాన్‌ పనులపై దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఇటు దేవస్థాన ఈవో శీనానాయక్‌తో పాటు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నదాన భవనం, లడ్డూ పోటులో అత్యాధునికమైన మిషనరీ ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది జనవరి 28న దుర్గగుడి ఈవో శీనానాయక్‌ పర్యవేక్షణలో ఆలయ ఈఈలు, ఏఈవోలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సైతం వెళ్లి అక్కడ వినియోగిస్తున్న టెక్నాలజీని పరిశీలించారు. ప్రతి వారం జరిగే దేవదాయ శాఖ కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం అభివృద్ధి పనులపై సమీక్ష తప్పని సరి. అయితే ఇంత పెద్ద ఎత్తున సమీక్షలు జరుగుతున్నా అభివృద్ధి పనులు మాత్రం వేగం పుంజుకోవడం లేదు.

పూర్తి కాని అన్నదాన, లడ్డూ పోటు

భవన నిర్మాణాలు

పెరిగిన భక్తుల సంఖ్య

వసతులు అంతంత మాత్రమే

భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించని

చంద్రబాబు సర్కారు

సమీక్షలతోనే సరిపెడుతున్న వైనం

ప్రస్తుతానికి అన్నదాన భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అన్న ప్రసాద తయారీ నిమిత్తం కుకింగ్‌ పాయింట్‌, స్టోర్‌ రూమ్‌, కోల్డ్‌ స్టోరేజీ వంటి పనులు జరుగుతున్నాయి. మొదటి అంతస్తులో ఎక్కడి పనులు అక్కడే మిగిలి ఉన్నాయి. అన్నదానం భవనం బయట వైపున ఎలివేషన్‌ పనులు మాత్రం జరుగుతున్నాయి. మిగిలిన పనులు మందకొడిగా సాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement