భార్యను హత్య చేసిన భర్త అరెస్టు | - | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

May 6 2026 9:01 AM | Updated on May 6 2026 9:01 AM

పామర్రు: భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో మోది హతమార్చిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ పి.శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం డీఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. దిమ్మిటి ప్రసన్నకుమారి(30) తన భర్త మురళీ కృష్ణతో వివాదాల కారణంగా భర్తను వదిలేసి మరో వ్యక్తితో పామర్రులో సహజీవనం చేస్తోంది. తనతో కాపురం చేయకుండా కుటుంబ పరువు తీస్తున్నట్లుగా భావించిన మురళీకృష్ణ తన అన్నదమ్ములను వెంట బెట్టుకుని ఈనెల 4వ తేదీ ఉదయం రెండు బైక్‌లపై పామర్రు వచ్చాడు. ప్రసన్నకుమారి ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఇనుప రాడ్డుతో మోది చంపాడు. అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోతూ దుస్తులు, ఆమెను చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును గుడివాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పోదలలో పడవేసి వెళ్లి పోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోళ్ల రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న కుమారిని తన అల్లుడు మురళీ కృష్ణ, అన్నయ్య రాంబాబు, మరో తమ్ముడు నాగేశ్వరరావు అలియాస్‌ చంటి తన అన్నయ్య రాంబాబు కుమారుడు మైనర్‌ అయిన మరో వ్యక్తితో కలిసి తన కుమార్తెను ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి పామర్రు ఇన్‌ఛార్జి గుడివాడ టూ టౌన్‌ సీఐ హనీష్‌ కొంది మంది సాక్షులను విచారించగా తదుపరి పామర్రు సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్‌ నాగ ప్రసాద్‌ విచారణను కొనసాగిస్తూ మరి కొందరు సాక్షులను విచారించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో కొత్తూరు దాటిన తర్వాత కొడాలి రామేశ్వరరావు మునగతోట పక్కన నిందితులు వారు దాచిన ఇనుప రాడ్డు బట్టలు వెతుకుతుండగా, పామర్రు సీఐ సీహెచ్‌ నాగప్రసాద్‌, ఎస్‌ఐ కె.శ్రీనివాస్‌ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇనుపరాడ్డు, దుస్తులు, వారు వాడిన ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు. నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్‌ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పామర్రు సీఐ, ఎస్‌ఐలను ఆయన అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement