
ఉప్పొంగిన వాగులు..
మైలవరం నియోజకవర్గంలోని మైలవరం కొండవాగు, జి.కొండూరు మండల పరిధిలో పులివాగు, దొర్లింతాల వాగు, కప్పలవాగు, బుడమేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏనుగుగడ్డవాగు, ఉబ్బడివాగు పొంగి పొర్లుతుండడంతో కొటికలపూడి, చిలుకూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో జూపూడి చిన్నలంక, పెద్దలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల పరిధిలో వరిపైరు ముంపునకు గురైంది. రెడ్డిగూడెం మండల పరిధిలో కోతులవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఓబులాపురం, రంగాపురం గ్రామాల మధ్యన రహదారిపై భారీగా వరద ప్రవాహం చేరడంతో ఈ రెండు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
ఉద్ధృతంగా బుడమేరు..
ఏ.కొండూరు మండల పరిధిలోని కొండల్లో ప్రారంభమయ్యే బుడమేరు వాగులో కొండవాగు, కోతులవాగు, పులివాగుల వరద ప్రవాహం కలిసి గురువారం 3500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. బుడమేరుపై ఉన్న వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద 3.8మేర నీటి నిల్వ ఉంది. ఈ వరద ప్రవాహం బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలుస్తోంది. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల మధ్యన చప్టాపై బుడమేరు వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు.