
కదిలించిన ఎడ్లంక కథనాలు
ఎడ్లంక దీవి కోతను పరిశీలించినసెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అధికారులు ఎడ్లంక గ్రామం కోతకు గురికాకుండా శాశ్వత పరిష్కార చర్యలు
రక్షణ చర్యలు చేపట్టకపోతే గ్రామంలో ఉండలేం
ఎడ్లంక(అవనిగడ్డ): వరదల వల్ల తీవ్రస్థాయిలో కోతకు గురైన ఎడ్లంక గ్రామ దుస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన పలు కథనాలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి. ‘‘ఎడ్లంకకు గుండెకోత’’, ఎడ్లంకకు వంతెన నిర్మించండి’’, ‘‘కన్నీటిలంక’’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కఽథనాలకు స్పందించిన కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సంబంధిత అధికారులు గ్రామాన్ని సందర్శించి కోతకు గురైన ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి తీసుకెళ్లారు. పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు అధికారులు చెప్పారు.
గ్రామాన్ని సందర్శించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అధికారులు
వరద వల్ల కోతకు గురైన ఎడ్లంక గ్రామాన్ని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈ ఎ.విజయభాస్కర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం గురువారం సందర్శించింది.
పడవలో గ్రామం చుట్టూ తిరిగి కోతకు గురైన ప్రాంతాన్ని వారు సందర్శించారు. వరద వల్ల నదిలోకి పడిపోయిన గృహాలు, చెట్లు, తిరుపతమ్మ ఆలయం శిథిలాలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి గత పదేళ్ల నుంచి ఎడ్లంక కోతకు గురవుతున్న విధానాన్ని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బ్రహ్మపుత్ర ప్రాంతంలో చేపట్టిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక – సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈ విజయభాస్కర్
నదీ ప్రవాహం తరచూ తన దిశను మార్చుకుంటుందని, వరదల సమయంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుందని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈ ఎ.విజయభాస్కర్ చెప్పారు. దీనివల్ల కొన్ని ప్రాంతాలు తీవ్ర కోతకు గురవుతూ ఉంటాయన్నారు. ఈ ప్రభావం వలనే ఎడ్లంక గ్రామం తీవ్రంగా కోతకు గురవుతోందని చెప్పారు. బ్రహ్మపుత్ర నది వద్ద ఇలాంటి పరిస్థితి ఉండగా, జియో ట్యూబ్, జియో బ్యాగ్, జియో గ్రాయిన్స్ ఏర్పాటు ద్వారా సమస్యను అరికట్టినట్టు తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు ఇస్తాయన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని విజయ్‌భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఎస్‌ఈ జి.శివకుమార్‌రెడ్డి, కృష్ణాడెల్టా సిస్టం సీఈ బి.రాంబాబు, ఇరిగేషన్ ఎస్‌ఈ ఆర్.మోహనరావు, ఈఈ రావెళ్ళ రవికిరణ్, గ్రామీణ యువజన వికాస సమితి చైర్మన్ మండలి వెంకట్రామ్(రాజా), సర్పంచ్ పాలెపు సామ్రాజ్యం, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఆర్‌సీ డీఈ సీహెచ్ గోపీనాఽథ్, ఏఈ కట్టా హరీష్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గత రెండేళ్ల నుంచి తమ గ్రామం తీవ్ర కోతకు గురవుతోందని, ఎప్పుడు ఎవరి ఇల్లు పడిపోతుందో తెలియడం లేదని కొంతమంది బాధితులు విజయభాస్కర్‌కు వివరించారు. రక్షణ చర్యలు చేపట్టకపోతే గ్రామంలో ఉండలేమని, అవనిగడ్డలో స్థలాలు ఇస్తే వెళ్లిపోతామని చెప్పారు. ఇప్పటికే కొంతమంది నివేశన స్థలాల కోసం అర్జీలు సమర్పించారని, ఇంకా ఎవరన్నా ముందుకొస్తే వారి అర్జీలు తీసుకుని జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. అనంతరం స్థానిక ఎంపీపీ స్కూల్‌లో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు డ్రోన్‌తో తీయించిన వీడియోలను వారు పరిశీలించారు.

కదిలించిన ఎడ్లంక కథనాలు