
దివ్యాంగుల పింఛన్లలో కోతకు కూటమి కుట్ర
వైఎస్సార్ సీపీ దివ్యాంగుల రాష్ట్ర నాయకుడు కిరణ్‌రాజ్
భవానీపురం(విజయవాడపశ్చిమ): మూడు దశాబ్దాలకుపైగా 100–90 శాతం వైకల్యం ఉన్నవారికి రీ వెరిఫికేషన్‌లో 60–50 శాతం వైకల్యం ఎలా తగ్గుతుంది? ముఖ్యంగా పుట్టుకతో వచ్చిన వైకల్యం వయసు పెరిగేకొద్దీ తగ్గుతుందా? ఇదంతా దివ్యాంగుల పింఛన్లలో కోత వేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విభిన్న ప్రతిభావంతుల శాశ్వత సదరం సర్టిఫికెట్లలో వైకల్య శాతాన్ని కుదించి పింఛన్లు తొలగిస్తూ జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, ఉన్న పింఛన్లను యథావిథిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొంగ సాఫ్ట్‌వేర్‌తో 40 శాతం కంటే తక్కువ వైకల్య శాతం ఉన్నట్లుగా చూపించి కూటమి ప్రభుత్వం మోసగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుణదల(విజయవాడ తూర్పు): సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో డ్రగ్స్‌ను తరలిస్తున్న ఇద్దరు విద్యార్థులను విజయవాడ ఈగల్ టీమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం విశాఖపట్నం కు చెందిన శ్రీవాత్సవ్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అదే నగరానికి చెందిన బి.హవీలా అనే యువతి ఎంబీఏ పూర్తి చేసింది. గత కొన్నేళ్లుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరూ అనుకోని పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. డ్రగ్స్‌కు పూర్తిగా బానిసలైన వీరిద్దరూ సులువైన మార్గంలో డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. ఆ వచ్చిన డబ్బుతో డ్రగ్స్‌ను తీసుకుంటూ ఆ మత్తులో తిరుగుతున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌ను విక్రయించడం ద్వారా అధికమొత్తంలో డబ్బులు వస్తాయని తెలిసిన వీరిద్దరూ బెంగళూరు వెళ్లి అక్కడ సుమారు లక్ష రూపాయల విలువ గల (ఎండీఎంఏ) డ్రగ్స్‌ను కొనుగోలు చేశారు. కొంత డ్రగ్‌ను వారు తీసుకుని ఆ మత్తులో తూగుతూ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బెంగళూరు నుంచి విశాఖపట్నానికి పయనమయ్యారు. గురువారం మధ్యాహ్నం తమకు అందిన పక్కా సమాచారంతో విజయవాడ ఈగల్ టీమ్ పోలీసులు విజయవాడ మహానాడు రోడ్డు జంక్షన్ వద్ద ఆ బస్సును నిలిపి తనిఖీ చేయగా వీరిద్దరి వద్ద 19 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న కారణంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారి వద్ద గల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గన్నవరం: స్థానిక చైన్నె–కోల్‌కత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ న్యాయవాది మృతి చెందిన ఘటనపై గన్నవరం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక గ్యాస్ కంపెనీ ఏరియాలో నివాసం ఉంటున్న న్యాయవాది ఎంవీవీ వెంకటేశ్వరరావు(52) విజయవాడ కోర్టులో పనిచేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి స్థానిక చార్మినార్ హోటల్ వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ప్రమాదవశాత్తు వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.