
రైల్లో బంగారు ఆభరణాల దొంగ అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును చోరీ చేసిన నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) డీఎస్పీ రత్నరాజు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని జీఆర్‌పీ స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన తొరియవాలా కుజమా ఈ నెల 16న భగత్ కి కోటి నుంచి చైన్నెకి ఏ1 కోచ్‌లో ప్రయాణం చేస్తోంది. రైలు విజయవాడ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు చూసుకోగా తన సీటు వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో రైలు విజయవాడ సమీపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాగును చోరీ చేసినట్లు ఆమె రైలు మదాద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన విజయవాడ జీఆర్‌పీ సిబ్బంది ఆర్‌పీఎఫ్ పోలీసుల సహకారంతో రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల ద్వారా చోరీకి పాల్పడింది గుంటూరుకు చెందిన పాతనేరస్తుడు అబ్దుల్ రహ్మాన్‌గా గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఏసీ కోచ్‌లనే టార్గెట్‌గా చేసుకుని ప్రయాణికుడిలా రైలులో ప్రయాణం చేస్తూ అదను చూసి లగేజీ బ్యాగులను చోరీ చేస్తుంటాడని డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే విజయవాడ జీఆర్‌పీ పోలీసులు నాలుగు కేసుల్లో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అయినా తన నేర ప్రవృత్తిని మార్చుకోకుండా అదే తరహా నేరాలకు పాల్పడుతున్నాడన్నారు. నిందితుని నుంచి రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఇతర చోరీ కేసుల్లో రూ.2లక్షల విలువైన రెండు ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్‌లు రికవరీ చేశారు. సమావేశంలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సీఐలు జె.వి రమణ, ఫతే ఆలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.10 లక్షల చోరీ సొత్తు స్వాధీనం