
బషీర్‌బాగ్ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
స్మార్ట్ మీటర్లు, ట్రూఅప్ చార్జీలు రద్దు చేయకపోతే సహించేది లేదు విద్యుత్ అమర వీరుల సంస్మరణ సభలో వామపక్ష పార్టీల నేతలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బషీర్‌బాగ్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ భారాలపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విద్యుత్ పోరాటంలో ప్రభుత్వ దమనకాండకు బలైన అమరవీరుల సంస్మరణ సభ గురువారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో జరిగింది. విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్థన్‌రెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. సభలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ భారాలను, స్మార్ట్ మీటర్లను ఆపాలన్నారు. లేని పక్షంలో ప్రజల మద్దతుతో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు ఎ.వనజ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ రంగం మొత్తాన్ని కార్పొరేట్ల పరం చేస్తున్నారని, ప్రజలు తిరగబడాలని పిలుపిచ్చారు. సమావేశానికి సీపీఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్.బాబూరావు, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఐ(ఎం.ఎల్) పార్టీ రాష్ట్ర నాయకుడు డి.హరినాథ్, సీపీఐ(ఎం.ఎల్) న్యూ డెమొక్రసీ నాయకులు పోలారి, ఎస్‌యూసీఐ నాయకుడు సుధీర్, ఎంసీపీఐ నాయకుడు ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.