ఉపాధ్యాయుల సతమతం! | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సతమతం!

Aug 2 2025 6:09 AM | Updated on Aug 2 2025 6:09 AM

ఉపాధ్యాయుల సతమతం!

ఉపాధ్యాయుల సతమతం!

● బోధనేతర పనులతో ఉక్కిరిబిక్కిరి ● పాఠాలు చెప్పనీయడం లేదని ఆవేదన ● దత్తత పేరుతో భారం ● పీ 4పై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు ● ఉమ్మడి కృష్ణాజిల్లాలోనూ ‘దత్తత’ ఆదేశాలిస్తారని ప్రచారం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాఠాలు చెప్పుకోనీయడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపనులకు తోడు ఇప్పుడు పీ 4 దతత్త భారం కూడా టీచర్లపై పడనుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు కిట్ల పంపిణీ.. వాటి వివరాలను ఆన్‌లైన్‌ చేయడం, మెగా పేరెంట్స్‌ సమావేశం, యోగాంధ్ర, యాప్‌లు, శిక్షణ, వివరాల నమోదు వంటివాటితో వీరంతా విసిగిపోయారు. బోధనేతర పనుల కారణంగా పాఠాల బోధన మొక్కుబడిగా సాగు తోంది. దీంతో విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు తగ్గుతాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 9 వేల మందికిపైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరంతా విద్యార్థుల ఉన్నతికి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కృషి చేశారు. అయితే కొంతకాలంగా యాప్‌లు, ఇతర పనుల కారణంగా తరగతులపై శ్రద్ధ చూపే సమయం తక్కువగా ఉంటోంది.

పెరుగుతున్న ఒత్తిడి

పీ 4లో భాగంగా ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇతర జిల్లాలతో పాటుగా ఉమ్మడి కృష్ణాలోనూ ఉత్తర్వులు జారీ చేసేందుకు సమాయత్తమవుతోందంటూ వారు మండి పడుతున్నారు. ఉపాధ్యాయులను పాఠశాలలకు పరిమితం చేయకుండా ఇలాంటి ఒత్తిడి తీసుకురావటం ఏమిటంటూ గురువులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర జిల్లాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు!

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పాఠశాల విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పీ 4 పథకంలో భాగంగా పిల్లలను, కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. దాంతో ఆయా స్థానిక జిల్లా అధికారులు ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నామని, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారిని భాగస్వాములను చేస్తామంటూ వారు ప్రకటన చేయాల్సి వచ్చింది.

జిల్లా యంత్రాంగానికి టార్గెట్లు

పీ 4 పథకానికి సంబంధించి ప్రతి జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం టార్గెట్లను నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ పాఠశాల విద్యాశాఖాధికారులు దీనిపై దృష్టి సారించారు. ఇక్కడ జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయుల లెక్కలను సైతం తీసి ఉత్తర్వులు ఇవ్వటానికి సమయుత్తమయ్యారు. అయితే కొన్ని జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో తాత్కాలికంగా ఉమ్మడి జిల్లాలో వాయిదా వేసినట్లు తెలిసింది.

బోధనపై ప్రభావం

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. మొన్నటి వరకూ యోగాంధ్ర అంటూ నెల రోజుల పాటు హడావుడి చేసి ఉపాధ్యాయులను పరుగులు తీయించారని వారు చెబుతున్నారు. అనంతరం మెగా పెరంట్స్‌ మీట్‌ అంటూ మరో 20 రోజుల పాటు హడావుడి చేసి తమను కంగారు పెట్టారంటూ ఉపాధ్యాయులు గుర్తు చేసుకుంటున్నారు. గత నెలలో బదిలీల పేరుతో గందరగోళం చేశారని తాజాగా పీ 4 అంటూ ఆందోళనకు గురి చేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ఉపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారని, విద్యార్థులకు తీవ్రమైన నష్టం కలుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement