
ఎరువు..కరువు
కంకిపాడు: ఖరీఫ్ సాగు రైతులకు ఎరువు కరువైంది. సొసైటీల్లో ఎరువుల నిల్వలు నిండుకున్నాయి. బయటి మార్కెట్‌లో వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరత కారణంగా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. అదునుకు వేయాల్సిన ఎరువు దొరక్క పైరు ఎదుగుదల లోపిస్తుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కోటి ఆశలతో చేపట్టిన ఖరీఫ్ సాగు కష్టాలతో సాగుతున్నా, వ్యవసాయశాఖ కాకిలెక్కలతో సరిపెడుతుందే తప్ప ఎరువులను సమృద్ధిగా అందించడం లేదు. అండగా నిలవాల్సిన కూటమి సర్కారు రైతులను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సీజన్‌కు అవసరమైన ఎరువులను అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందగా. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. ఖరీఫ్‌లో ఎరువుల కొరతను తీర్చాలంటూ రైతు పక్షాన ఆందోళనలు నిర్వహిస్తోంది.
ఎరువుల కొరత..
ప్రస్తుతం ఎకరాకు ఒక కట్ట యూరియా, ఒక కట్ట డీఏపీ తప్పనిసరిగా వేయాల్సి ఉంది. పైరు ఎదుగుదలకు దోహదపడే యూరియా ప్రస్తుతం దొరకడం లేదు. 80శాతం సొసైటీల్లో ఎరువులు లేకపోవడంతో వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా ఎమ్మార్పీ ధర రూ 265.50 ఉండగా, కొందరు వ్యాపారులు రూ. 310 నుంచి రూ.330 వరకూ విక్రయిస్తున్నారు. డీఏపీ ఇతర ఎరువులతోపాటు జింకు, గుళికలను అంటగడుతున్నారు. అవి కొంటేనే డీఏపీ ఇస్తామంటూ రైతులను అందినకాడికి దోచేస్తున్నారు. యూరియా కొరత కారణంగా డీఏపీ రూ.1350 చొప్పున కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
పట్టించుకోని అధికారులు...
జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతుంటే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం తాపీగా ఎరువుల లభ్యతపై కాకిలెక్కలు చెబుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అందించడంలో విఫలమయ్యారు. మొక్కుబడిగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ఉయ్యూరులో విజిలెన్స్ తనిఖీలు చేపట్టగానే, వ్యాపారులు దుకాణాలు మూసివేశారంటే బహిరంగ మార్కెట్‌లో ఎరువుల గోల్‌మాల్ ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోఆపరేటివ్ సొసైటీల్లో 78 టన్నులు, హబ్‌లలో 0.24 టన్నులు, ఔట్‌లెట్‌లలో 534 టన్నులు, పీఏసీఎస్‌లలో 3807 టన్నులు, రిటైలర్స్ వద్ద 3191 టన్నులు, ఇతరుల వద్ద కలిపి జిల్లాలో మొత్తం 7,696 టన్నుల ఎరువుల లభ్యత ఉన్నట్లు అధికారులు చెబుతుండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
నిర్లక్ష్యం వీడని పాలకులు..
కూటమి సర్కారు రైతు విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సాగునీరు విడుదల, విత్తనాల సరఫరాలోనూ వైఫల్యం చెందింది. తాజాగా ఎరువుల లభ్యతలోనూ అలసత్వం కనబరుస్తుండటం రైతుల పాలిటశాపంగా మారింది. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ఖరీఫ్ సాగు కష్ట మేననే రైతులు అభిప్రాయపడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వహయాంలో రైతుభరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా సకాలంలో ఎరువులు అందించడంతోపాటు పెట్టుబడిసాయాన్ని సైతం అందించిన వైనాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు.
ప్రభుత్వ పతనం తప్పుదు : కై లే
వైఎస్సార్ సీపీ పోరుబాట..
అల్లాడుతున్న రైతులు
సొసైటీల్లో నిండుకున్న ఎరువుల నిల్వలు
మార్కెట్‌లో అన్నదాతల జేబులకు చిల్లు
ఎరువుల లభ్యతపై
వ్యవసాయశాఖ కాకి లెక్కలు
నిర్లక్ష్యంగా కూటమి సర్కారు
రైతుపక్షాన పోరుబాటలో వైఎస్సార్ సీపీ
ఎరువుల కొరతతో అల్లాడుతున్న రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేపట్టింది. ఎరువులు సమృద్ధిగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ నేతృత్వంలో నియోజకవర్గవ్యాప్తంగా రైతుల పక్షాన ఆందోళనలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతులు అందించి సమస్యను వివరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ సమాయత్తం అవుతోంది.
పెదపారుపూడి: ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి పోయేరోజులు దగ్గరలోనే ఉన్నాయని పామర్రు మాజీఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఆయన పెదపారుపూడి వైఎస్సార్ సీపీ మండల నాయకులతో కలసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీను నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు అన్నిరకాల ఎరువుల అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకా ఎరువుల కృతిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు యూరియా క్లాంపెక్స్ అడుగుతుంటే షాపుల యజమానులు గుళికలు, జింక్‌నకు లింకు పెట్టి అమ్ముతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులకు ఎరువులు అందుబాటులోకి వచ్చేవరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని వివరించారు.
దోచేస్తున్నారు..
సొసైటీల్లో ఎరువులు లేవు. వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. యూరియా ధర రూ.265 ఉంటే, రూ.310 నుంచి రూ.330 వరకూ అమ్ముతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఎరువులు దక్కడం లేదు. అధికారులు దృష్టిసారించి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా తగినచర్యలు తీసుకోవాలి.
పి.దుర్గారావు, కౌలురైతు, మద్దూరు
ఒక్క బస్తా కూడా దొరకలేదు...
నేను నాలుగు ఎకరాల్లో వరిసాగు చేశాను. ప్రస్తుతం యూరియా, డీఏపీ వేయాలి. సొసైటీలు చుట్టూ తిరిగా యూరియా లేదు. బయటి మార్కెట్‌లో డీఏపీ అడిగితే జింకు, గుళికలు అంటగట్టారు. చేసేది లేక అవి కూడా కొని డీఏపీ వేసి సరిపెట్టా. యూరియా కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం.
వి.జాన్‌మోజేస్, రైతు, జగన్నాథపురం

ఎరువు..కరువు

ఎరువు..కరువు