
అంతా మంత్రి ‘కొల్లు’ డైరెక్షన్‌లోనే
మాజీమంత్రి పేర్ని నాని
చిలకలపూడి(మచిలీపట్నం): ఓ టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమవ్యవహారం తదనంతర ఘటనలన్నీ మంత్రి కొల్లు రవీంద్ర డైరెక్షన్‌లోనే చోటుచేసుకున్నాయని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీ పార్టీలోని నాయకుని కుటుంబ వ్యవహారాలు, గొడవలను చివరికి మాకు ఆపాదించడమేమిటన్నారు. మీ పార్టీ, కుటుంబవ్యవహారాల్లో జరిగిన గొడవలకు మాకేమి సంబంధమని మంత్రి కొల్లు రవీంద్రను ప్రశ్నించారు. టీడీపీ నాయకుడి కుమారుడు ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి తీసుకువెళ్లిన ఘటనతో మాకు సంబంధం ఎలా ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రేమికులను తీసుకువచ్చేందుకు పోలీసులు ఒడిశా వెళ్లడం నిజం కాదా? ప్రశ్నించారు.
హైదరాబాద్ ఎందుకు తీసుకువెళ్లారు...
టీడీపీ నాయకుడి కుమారుడు, ఆ యువతి ఒడిశాలో దొరికిన అనంతరం వారిని మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాకుండా భువనేశ్వర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారో విచారణ చేపట్టాలని నాని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వీరితో ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న నోవాటెల్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఏమి కౌన్సెలింగ్ ఇచ్చారు? ఆ యవతికి ఏం చెప్పారు? యువతి తండ్రితో ఏం మాట్లాడారో పోలీసులు విచారణ చేస్తే తేటతెల్లమవుతుందన్నారు. వీటితోపాటు ఒడిశా వెళ్లేందుకు అభినవ్‌కు ఫోన్ పే ద్వారా డబ్బులు ఎవరు పంపించారు...భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ ఎంత మంది వెళ్లారు...విమాన టికెట్లు ఎవరు కొన్నారు...హైదరాబాద్ నుంచి మచిలీప ట్నంకు ఎవరు మాట్లాడితే వారిని కారులో తీసుకువచ్చారో విచారణ చేస్తే పోలీసులు ఏవిధంగా ప్రవర్తించారో ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చిలకలపూడి సీఐ నబీతోపాటు కానిస్టేబుల్ మల్లి తీరుపై డీఎస్పీ చప్పిడి రాజా, ఎస్పీ గంగాధరరావు పూర్తిస్థాయి విచారణ చేస్తే నిజాలు నిగ్గుతేలతాయన్నారు. ఈ వ్యవహారమంతా మంత్రి కొల్లు రవీంద్ర డైరక్షన్, పోలీసుల ప్రమేయంతోనే సాగిందని ఆరోపించారు.
కాల్ డేటాతో వెలికితీయాలి..
యువతి తల్లి తాగిన పురుగుమందు సీసా ఎక్కడ కొన్నారు, ఎవరు తెచ్చారో విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయని పేర్ని నాని అన్నారు. ఓ కుటుంబానికి అన్యాయం జరిగితే నా కుమారుడు వెళ్లి ఆసుపత్రిలో వారిని పరామర్శించడం తప్పా? అని ప్రశ్నించారు. ఓ మహిళకు అన్యాయం జరిగితే పరామర్శించిన మాపార్టీ మహిళా అధ్యక్షురాలిపై విమర్శలు చేయడం టీడీపీ వారి అనైతికతకు నిదర్శనమన్నారు. యువతి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి రాజీ చేసుకోవడం కోసం అప్సర హోటల్, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కొంతమంది టీడీపీ కాపు పెద్దలు యత్నించడం, గొడవలుపడటం జరగలేదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చిలకలపూడి సీఐ నబీ కాల్ డేటా, కానిస్టేబుల్ మల్లి చేసిన వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపితే ఎవరి డైరక్షన్‌లో...ఎవరి కోసం ఈతతంగమంతా చేశారో తెలిసిపోతుందన్నారు. దిగజారుడు రాజకీయాలతో యువతిని బలిచేయకుండా మనిషిగా ప్రవర్తించి వారిద్దరికీ వివాహం జరిపించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. సమావేశంలో మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, నగర పార్టీ అధ్యక్షులు మేకల సుబ్బన్న, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.