
విజయవాడ: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్‌లో శనివారం(ఆగస్టు 2) బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాల్లాది విష్ణుతో పాటు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలిస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్ రూ.13 వేలు రైతు భరోసా కింద రైతులకు అందించారు. ఐదేళ్లలో రూ. 34,288 కోట్లు రైతులకు ఇచ్చారు. చంద్రబాబు 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు కేంద్రం ఇచ్చినదాంతో కలిపి ఏడు వేలు మాత్రమే ఇచ్చారు.
జగన్ ఐదేళ్లూ రైతు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడు లక్షల మంది రైతులకు కోత పెట్టింది. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని కబుర్లు చెప్పారు. ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.