
‘వైరా’లో గల్లంతైన వ్యక్తి శవమై కనిపించాడు
కంచికచర్ల: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వైరా ఉపనదిలో గల్లంతై శవమై కనిపించిన ఘటన మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. వీరులపాడు ఎస్‌ఐ అనిల్ తెలిపిన వివరాల మేరకు వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామానికి చెందిన నాగార్జున తిరుపతిరావు(31) తన స్నేహితుడు సాగర్‌తో కలసి గత నెల 22వ తేదీ మధ్యాహ్న సమయంలో గ్రామంలోని వైరా ఉపనదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాళ్లు కడుగుదామని నదిలో దిగడంతో ఒక్కసారిగా తిరుపతిరావుకు ఫిట్స్ రావటంతో ఉపనదిలో కొట్టుకుపోయాడు. దీనిపై సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి 23,24,25 తేదీల్లో గల్లంతైన వ్యక్తికోసం తాటిగుమ్మి, నందలూరు, గండేపల్లి, కీసర, పెండ్యాల, వేములపల్లి సమీపంలోని మున్నేరులో వెదికారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలియలేదు. ఈనెల 1వ తేదీన గండేపల్లి గ్రామానికి చెందిన మట్టా వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బాబు అనే రైతు తన పశువులను మేపేందుకు నది ఆవతలి ఒడ్డుకు తోలుకెళ్లాడు. కీసర సమీపంలో మున్నేటిలో ఓ శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు కుటుంబసభ్యులు వచ్చి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చేపలు పట్టేందుకు వెళ్లిన తిరుపతిరావు 11 రోజుల తర్వాత విగతజీవిగా కనిపించావా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వైద్యులు శవ పంచనామా చేశారు. తిరుపతిరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
యువతి ప్రేమ నిరాకరించిందని
యువకుడి ఆత్మహత్యాయత్నం
గుడివాడరూరల్: ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని తటివర్రు గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యువకుడు కొల్లూరి సంపత్‌కుమార్ (25)కు ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆమెతో కొన్ని రోజులుగా నిత్యం చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందాని సంపత్‌కుమార్ చెప్పడంతో ఆ యువతి నిరాకరించింది. తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్‌కుమార్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. వారు వెంటనే అతన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ తరలించారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి బలవన్మరణం
కాచవరం(ఇబ్రహీంపట్నం): అనుమానాస్పద స్థితిలో యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచవరం ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విశ్వనాధపల్లి సాయితేజ (19) చిన్నప్పటి నుంచి కాచవరంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. అతను చెడు అలవాట్లుకు బానిసయ్యాడు. తలుపులు దగ్గరకు వేసుకుని గదిలో టీవీ చూస్తుండగా అమ్మమ్మ బయటకు వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత వచ్చి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎంతసేపటికి తీయకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడటం కనిపించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.