
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): దసరా ఉత్సవాల్లో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లుచేస్తామని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం సీపీ రాజశేఖరబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో దుర్గగుడి అధికారులు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. వీటికి పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానుండటంతో భద్రత ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. క్యూ లైన్లలో, స్నాన ఘాట్ల వద్ద రద్దీ, ప్రసాదం కౌంటర్ల వద్ద ఏర్పాట్లు, రద్దీని తగ్గించి, భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రత్యేకంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా, సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం, సమాచార నిమిత్తం వారికి మెరుగైన సౌకర్యాలు అందించడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎస్‌వీడీ ప్రసాద్, టెంపుల్ ఈఓ శీనానాయక్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఏవీఎల్ ప్రసన్నకుమార్, కె.కోటేశ్వరరావు, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్ పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల బందోబస్తుపై సీపీ సమీక్ష