
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యా అవార్డుకు జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ ఐదో తేదీ రాష్ట్ర పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ క్రమంలో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, పదేళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చచని సూచించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాల ఉప తనిఖీ అధికారి, ఉర్దూ రేంజ్ అధికారులు తమ పరిధిలోని ఉపాధ్యాయులకు సంబంధించిన దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత తనిఖీ అధికారుల సిఫారసులు లేని దరఖాస్తులను స్వీకరించరని పేర్కొన్నారు. సంబంధిత దరఖాస్తు నమూనాను ఆయా అధికారులు కార్యాలయాల నుంచి పొందవచ్చని తెలిపారు.
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య
హనుమాన్‌జంక్షన్ రూరల్: తల్లిదండ్రులు మందలించారనే కోపంతో తొమ్మిదో తరగతి విద్యార్థి పురుగుల మందు సేవించి అత్మహత్యకు పాల్పడ్డాడు.బాపులపాడు మండలం బండారుగూడెంకు చెందిన అలుగుల సుశాంత్ (14) తేలప్రోలులోని జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి. తరచుగా పాఠశాలకు వెళ్లకపోవడం, చదువును అశ్రద్ధ చేయటంతో తల్లిదండ్రులు సుశాంత్‌ను ఈ నెల 21వ తేదీ మందలించారు. హాస్టల్‌లో చేర్పిస్తామని హెచ్చరించారు. తీవ్ర మనస్తాపం చెందిన సుశాంత్ ఇంటి ఆవరణలో గడ్డివామి వద్ద భద్రపర్చిన పురుగుల మందు డబ్బా తీసుకుని సేవించారు. తండ్రి జోజిబాబు సుశాంత్‌ను చిన్నవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.