
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ ఇసుక రవాణా పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం.
వివరాల ప్రకారం.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుల కనుసన్నల్లో ఇసుక అక్రమంగా ఏపీ బోర్డర్ దాటేస్తోంది. అనంతరం, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు గ్రామం పెద్దవరం వద్ద ఇసుక డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణకు ఇసుక తరలించి ఎంపీ అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎంపీ మనుషులు గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమ వెనుక ఎంపీ ముఖ్య అనుచరుడు మాదాల హరిచరణ్ కిట్టు ఉన్నాడంటూ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో, అక్రమ ఇసుక వ్యవహారం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.
మరోవైపు.. పెద్దవరంలో నిల్వచేసిన ఇసుక డంపింగ్‌లను గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందన్నారు. పోలీసులే దగ్గరుండి సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపించారురు. అందుకే బోర్డర్‌లో సీసీ కెమెరాలు పెట్టలేదన్నారు. ఈ క్రమంలో ఏసీపీతో ఫోన్‌లో మాట్లాడిన కొలికపూడి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో తిరువూరుకు చెందిన గంజాయి బ్యాచ్‌కు ఇసుక అక్రమ రవాణాకు సంబంధం ఉందన్నారు. ఆ గంజాయి బ్యాచ్‌కు పోలీసులు సహకరిస్తున్నారు. ఒకే వ్యక్తి పేరుతో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.
