
‘సెర్ప్’తో మహిళా సాధికారత
భవానీపురం(విజయవాడపశ్చిమ): సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో చేపడుతున్న కార్యక్రమాలు మహిళల జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు మహిళా సాధికారతకు దోహదం చేస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఒక హోటల్‌లో సెర్ప్ ఆధ్వర్యాన మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ 4లో భాగస్వాములై మహిళా పారిశ్రామికవేత్తలు బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు కావాలని ఆకాంక్షించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థతో ఇప్పటికే ఎగ్జిబిషన్లు, వర్క్ షాపులు, ప్రత్యేక ఇగ్నేట్ సెల్ ద్వారా ప్రతి మహిళను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల ద్వారా అమలవుతున్న పథకాలతోపాటు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీ ఎఫ్‌పీఎస్), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎం ఎఫ్‌ఎంఇ) పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ వర్చువల్‌గా హాజరై దశ దిశా నిర్దేశం చేశారు. శిక్షణకు అన్ని జిల్లాల ఏపీఎం, డీపీఎం లైవ్లీహుడ్స్ వచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వీ నాంచారరావు, సెర్ప్ అసిస్టెంట్ డైరెక్టర్ మహిత, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ