
చంద్రబాబు రైతులకు ఏం చేశాడు
జగ్గయ్యపేట అర్బన్: చంద్రబాబు ఎన్నికలపుడు రైతులకు రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇప్పుడు ఏడాది తర్వాత ప్రధాని నరేంద్రమోదీ రూ.2 వేలు ఇస్తున్నాడు కాబట్టి వాటికి రూ.5 వేలు జమచేసి మొత్తం రూ.7 వేలు రైతులకు ఇస్తామంటున్నాడని, ఇదేనా మీరు ఆదుకునేది అని రామకృష్ణ ప్రశ్నించారు. సీపీఐ ద్వితీయ జిల్లా మహాసభలు శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ డిపో సెంటర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నేతలు బలుసుపాడు సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ అని గర్వంగా చెప్పుకుంటున్నారని, దీంతో ఒరిగింది ఏంటని ప్రశ్నించారు.
ట్రంప్ అంటేనే మోదీకి వణుకు
నరేంద్రమోదీ అమెరికాకు లొంగిపోయాడని ట్రంప్ అంటేనే వణుకన్నారు. వంద ఏళ్ల చరిత్ర కలిగిన సీపీఐ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో అగ్రభాగాన నిలబడిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ