
టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ పోలీసింగ్ బలోపేతం
లబ్బీపేట(విజయవాడతూర్పు):టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేలా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యాచరణతో ముందుకెళ్తున్నారని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా కొనియాడారు. పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్లు, 40 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అందజేశారు. పెట్రోలింగ్ బైక్‌లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడతాయన్నారు. విజయవాడ సిటీలో ట్రాఫిక్, నేరాలను నియంత్రించడంలో సీపీ రాజశేఖరబాబు పని తీరు బాగుందన్నారు. అస్త్రం టూల్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. డ్రోన్‌ల వినియో గంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణ, హెల్మెట్ వినియోగం, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు చర్యలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలను సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు వివరించారు. డ్రోన్‌లు, ట్రాఫిక్ పరికరాలను సమకూర్చేందుకు దాతలు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక శబ్దాలను వెలువరించే బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు.
రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా