నిబంధనలకు తూట్లు.. జేబుల్లోకి రూ. కోట్లు! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు తూట్లు.. జేబుల్లోకి రూ. కోట్లు!

Aug 1 2025 1:37 PM | Updated on Aug 1 2025 1:37 PM

నిబంధనలకు తూట్లు.. జేబుల్లోకి రూ. కోట్లు!

నిబంధనలకు తూట్లు.. జేబుల్లోకి రూ. కోట్లు!

ఉయ్యూరు: ఉయ్యూరు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అనధికార లే అవుట్‌లకు ల్యాండ్‌ మార్కు అయ్యింది. సామాజిక స్థలాలకు రెక్కలొచ్చాయి. కొందరు పచ్చ చొక్కా నేతల అండదండలతో చట్టంలో ఉన్న లొసుగులను సాకుగా చూపుతూ అక్రమ లే అవుట్‌లతో రూ.కోట్లు లూటీ చేస్తున్నారు. అమరావతి, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆశ చూపి పేద, మధ్య తరగతి వర్గాలను నిట్టనిలువునా దోచేస్తున్నారు. ఉయ్యూరు, గండిగుంట కేంద్రాలుగా సాగుతున్న రియల్‌ దందాలో రూ. 50కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ప్రజాధనం రియల్టర్లు, పచ్చనేతల జేబుల్లోకి మళ్లింది. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండటంతో ఇక్కడ అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు..

ఉయ్యూరు మునిసిపాలిటీ, గండిగుంట, చిన ఓగిరాల, ఆకునూరు, పెద ఓగిరాల, కడవకొల్లు, కా టూరు గ్రామాల్లో విచ్చలవిడిగా లే అవుట్‌లు వెలిశాయి. కొందరు సీఆర్‌డీఏ అనుమతులు తీసుకుని వెంచర్లు వేస్తుంటే.. మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికార లే అవుట్‌లను ఇష్టానుసారంగా వేస్తున్నారు. వ్యవసాయ భూములకు నాలా చెల్లించి ఆ వెంటనే లే అవుట్‌గా మార్చి స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. సెంటు రూ. 5లక్షల నుంచి రూ. 7లక్షల వరకూ ధర నిర్ణయించి మాయమాటలతో అమ్మేస్తున్నారు. ఉయ్యూరు, గండిగుంట పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఇదే తంతు కొనసాగుతోంది. పచ్చచొక్కా నేతలు, అధికారులకు దండిగా కాసుల వర్షం కురిపిస్తుండటంతో అడిగే నాథుడే లేకుండా పోయాడు. ఇటీవలి కాలంలో 50 ఎకరాలకు పైగా అనధికార లేఅవుట్‌లు వెలిసినట్లు సమాచారం.

మొక్కుబడి చర్యలతో సరి..

సీఆర్‌డీఏ నిబంధనలు ఉల్లంఘించి అనధికార లేఅవుట్‌ వేస్తే సీఆర్‌డీఏ చట్టం 114(2) ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. క్షేత్రస్థాయిలో ఆయా పంచాయతీ కార్యదర్శులు, మునిసిపల్‌ కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమన్వయం చేసుకుని సీఆర్‌డీఏ టీపీఓ, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు అనధికార లేఅవుట్‌లపై ఉక్కుపాదం మోపాలి. వాస్తవంగా ఎక్కడా అలాంటి చర్యలు కానరావడం లేదు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే మొక్కుబకడిగా నోటీసులు ఇచ్చి నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. అనధికార వెంచర్లకు సంబంధించి సీఆర్‌డీఏ, ప్రభుత్వం నుంచి ఉయ్యూరు మునిసిపల్‌ కార్యాలయానికి లేఖలు అందినా మీనమేషాలు లెక్కిస్తున్నారు.

‘పది శాతం’ నిబంధన కనుమరుగు..

ప్రజాప్రతినిధులు, సీఆర్డీఏ, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారుల ఉదాసీనత వైఖరి కారణంగా సామాజిక స్థలాలు కనుమరుగవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఎకరం విస్తీర్ణంలో లే అవుట్‌ వేసి స్థలం విక్రయించాలంటే పది శాతం భూమిని సామాజిక స్థలంగా మునిసిపాలిటీ, పంచాయతీలకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి. అనధికార వెంచర్ల ఫలితంగా ఒక్క సెంటు భూమి కూడా సామాజిక అవసరాలకు దక్కకుండా పోతోంది. ఉయ్యూరు, కాటూరు రోడ్డులోని సుమారు 17 ఎకరాల్లో లే అవుట్‌ నిర్మిస్తే ప్రజా సామాజిక అవసరాలకు 1.70ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. ఇవేవీ ఇవ్వకుండానే లే అవుట్‌ను సక్రమం చేసే పనిలో అధికారులు తలమునకలయ్యారు. ఆ భూమి మొత్తం రోడ్డు, ప్రహరీలు నిర్మించి సెంటు భూమి రూ. 20 లక్షల చొప్పున యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రూ. కోట్లలో సొమ్ము చేతులు మారుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు 1.70 ఎకరాల భూమి సామాజిక స్థలంగా కేటాయించాల్సి ఉంది. దాని భూమి ధర మార్కెట్‌లో రూ. 34కోట్లుగా ఉంది. మునిసిపాలిటీ పరిధిలో 1, 2, 3, 4, వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో అనధికార వెంచర్లు ఏర్పాటు చేశారు. ఉయ్యూరు, గండిగుంట సమీపంలో సరిహద్దుగా గల టీటీడీ సమీపంలో, ఆర్‌డీఓ కార్యాలయం ఎదురుగా నాన్‌ లేఅవుట్‌లు వెలిశాయి. ఈ లేఅవుట్‌లలోనూ సామాజిక స్థలం పత్తా లేకుండా పోయింది.

‘పచ్చ’ నేతల అండతో ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్లు

వ్యవసాయ భూముల్లో విచ్చలవిడిగా లే అవుట్లు

ఆయా ప్లాట్లలో సామాజిక స్థలం హాంఫట్‌

పచ్చ చొక్కా నేతల అండతో రియల్టర్ల దందా

రూ. 50కోట్లకు పైగా సొమ్ము లూటీ

మామూళ్ల మత్తులో యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement