
నేటి నుంచి నెఫ్రాలజిస్టుల సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య చికిత్సలపై చర్చించేందుకు నగరంలో మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నారు. ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు విజయవాడ లబ్బీపేటలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నెఫ్రాలజిస్టు డాక్టర్ నలమాటి అమ్మన్న తెలిపారు. సూర్యారావుపేటలోని తమ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మన్న మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం జరిగే ప్రారంభోత్సవ వేడుకలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరిరావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. అత్యాధునిక నెఫ్రాలజీ చికిత్సలు, ఆధునిక ఔషధాలు, నవీన ఆవిష్కరణల గురించి చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి విజ్ఞాన సర్వస్వంగా ఈ సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాధిక, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.