
స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తక్షణమే స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. నోటిఫికేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది ప్రత్యేక బీఈడీ చేసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నారు. డీఎస్సీ సిలబస్‌ను రిలీజ్ చేయాలని కోరారు. ఏపీ కేబినెట్ ఆమోదించిన 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను డైరెక్టుగా డీఎస్సీ ద్వారా నియామకం చేయాలన్నారు. గతంలో మాదిరి డీఎస్సీ నోటిఫికేషన్‌లో వయో పరిమితి సడలింపు ఇవ్వాలన్నారు. నోటిఫికేషన్ జారీలో నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు, ప్రత్యేక బీఈడీ అభ్యర్థులు పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్