
న్యాయం కోసం అన్నగా పోరాటం చేస్తా
ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను
పరామర్శించిన పేర్ని కిట్టు
మచిలీపట్నంఅర్బన్: న్యాయం కోసం ఒక అన్నగా పోరాటం చేస్తానని, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్, వైఎస్సార్ సీపీ నాయకులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) అన్నారు. ఆత్మహత్యకు యత్నించి సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను బుధవారం ఆయన పరామర్శించారు. టీడీపీ నేత కుమారుడు పల్లపాటి అభినవ్ ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి జాహ్నవి తల్లి శివపార్వతి ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే.
ఆ బాధ్యత ప్రభుత్వానిదే..
పేర్ని కిట్టు బాధితురాలికి జరిగిన అన్యాయంపై స్పందించారు. తాను ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు. బాధితురాలి కన్నీళ్ల వెనక దాగిన నిస్సహాయత తనను కలిచివేస్తోందన్నారు. ఆడపిల్లలపై అన్యాయాలు, మోసాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, బాధితురాలిని సెటిల్మెంట్ పేరుతో మోసం చేయాలని చూస్తున్నారన్నారు. డబ్బులు, ఉద్యోగం ఇస్పిస్తామంటూ ఆడపిల్ల జీవితానికి రేటు కట్టడం అమానుషమన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధి కారి బందెల థామస్‌నోబుల్, నగర ఉపాధ్యక్షుడు గూడవల్లి నాగరాజు, మాజీ డెప్యూటీ మేయర్ బందెల కవిత, నగరాధ్యక్షుడు మేకల సుబ్బన్న ఉన్నారు.