వరదపై వదంతులు నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

వరదపై వదంతులు నమ్మొద్దు

Jul 31 2025 7:30 AM | Updated on Jul 31 2025 7:30 AM

వరదపై వదంతులు నమ్మొద్దు

వరదపై వదంతులు నమ్మొద్దు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కృష్ణానదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో భారీగా ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌కు వస్తోందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లలో 55 గేట్లను ఒక అడుగు మేర, 15 గేట్లను రెండు అడుగులు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నట్లు చెప్పారు. వరదల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టర్‌ లక్ష్మీశ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారుల నుంచి వరద నీటి ప్రవాహానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వరద పెరిగే అవకాశం..

అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం నాటికి లక్ష క్యూసెక్కులు, రెండు రోజుల్లో మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని.. బ్యారేజీ ఎగువ, దిగువ వైపుల ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించామన్నారు. విజయవాడలో దాదాపు 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించామన్నారు. వీటిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలో పునరావాస కేంద్రాలతో మ్యాప్‌ చేసినట్లు తెలిపారు. ఒకవేళ ముంపు ముప్పు ఉన్నట్లయితే ఈ కేంద్రాలను తరలిస్తామని వివరించారు. డ్రెయినేజీ వ్యవస్థలు సరైన విధంగా ఉండేలా నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బుడమేరు, పులివాగు, కోతుల వాగు తదితర ప్రాంతాల విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మొద్దని సూచించారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం..

వరదలపై జిల్లా కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని.. ఇది 24 గంటలూ పనిచేస్తుందని, ఎవరైనా సమస్యలను కంట్రోల్‌ రూమ్‌ దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామని.. వచ్చే రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆందోళన చెందొద్దని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆర్‌.మోహనరావు, ఈఈ ఆర్‌.రవికిరణ్‌, డీఈ ఎన్‌.అజయ్‌బాబు, బ్యారేజ్‌ జేఈ సత్య రాజేష్‌ తదితరులు ఉన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement