
కేయూతో మార్పు ట్రస్ట్ ఎంఓయూ
కోనేరుసెంటర్: మహిళల అక్రమ రవాణాతో పాటు పలు సామాజిక అంశాల గురించి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యంతో కృష్ణా విశ్వవిద్యాలయం, విజయవాడకు చెందిన మార్పు ట్రస్ట్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. బుధవారం కృష్ణా వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, మార్పు ట్రస్ట్ నిర్వాహకురాలు సూఈజ్ ఎంఓయూపై సంతకాలు చేశారు. మహిళల భద్రత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై ఇరువురు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు పాల్గొన్నారు.
జర్మనీలో ఉపాధి అవకాశాలు
పెనమలూరు: బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం పూర్తి చేసి, రెండేళ్ల అనుభవం ఉన్న మహిళలకు జర్మనీ దేశంలో ఉపాధి అవకాశం కల్పిస్తామని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి.మోహన్‌రావు తెలిపారు. ఆయన బుధవారం వివరాలు తెలుపుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు 35 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. జర్మనీ భాషపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 7వ తేదీ లోపు దరఖాస్తు చేయాలని అన్నారు. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో సంక్షేమ బాలికల వసతి గృహాల్లో 8 నెలల నుంచి 10 నెలలు శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. వీసా, విమాన టికెట్ ఖర్చు ఉద్యోగం ఇచ్చిన వారే భరిస్తారన్నారు. ఆసక్తి కలిగిన వారు 99888 53335, 871265 5686 నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.
పవర్ లిఫ్టింగ్‌లో చంద్రకళ సత్తా
గుడివాడరూరల్: జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారిణి సిరా చంద్రకళ ఉత్తమ ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించిందని స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్టేడియం కార్యాలయంలో చంద్రకళను బుధవారం పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నాటకలో జరిగిన నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న తమ క్రీడాకారిణి చంద్రకళ 75కేజీల విభాగంలో 215కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటిందన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనేలా తమ కమిటీ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తామన్నారు. కోచ్ ఎం.వెంకటేశ్వరరావు, స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు.

కేయూతో మార్పు ట్రస్ట్ ఎంఓయూ