
కౌలు రైతులకు సత్వరమే పంట రుణాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీసీఆర్‌సీ కార్డులు కలిగిన ప్రతి అన్నదాతకూ సత్వరం పంట రుణాలు మంజూరు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బ్యాంకర్లకు సూచించారు. ఇందుకోసం ప్రతి బ్యాంకు బ్రాంచ్‌లోనూ క్రెడిట్ డే నిర్వహించాలన్నారు. సీసీఆర్‌సీ కార్డులున్న కౌలు రైతులకు సాగు రుణాల మంజూరుపై కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.
రుణం రైతు హక్కు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతులకు 56 వేల సీసీఆర్‌సీ కార్డుల జారీ లక్ష్యం కాగా ఇప్పటికే 42,415 కార్డులు అందించామన్నారు. రుణాలు పొందడం వారి హక్కు అని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు.. బ్రాంచుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయాలన్నారు. సీసీఆర్‌సీ రుణాల మంజూరు అనేది బ్యాంకుల పనితీరుకు కీలక ప్రగతి సూచిక అని పేర్కొన్నారు. ఇందులో మెరుగైన పనితీరు కనబరిచిన బ్యాంకులు, బ్రాంచులకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా కౌలు రైతులు పంట రుణాలు పొందడంలో సహాయ, సహకారాలు అందించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
ఫసల్ బీమాను రైతులు
సద్వినియోగం చేసుకోవాలి..
తుపాన్లు, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వివిధ పంటలకు బీమా పరిహారం పొందేందుకు అందుబాటులో ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)ను రైతులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ భూమి కలిగిన యజమానులు, సీసీఆర్‌సీ కార్డులు పొందిన సాగుదారులు పథకాల్లో చేరేందుకు అర్హులని వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఎల్‌డీఎం కె.ప్రియాంక, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ