
మానవ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆర్థిక ప్రయోజనాల కోసం మానవ అక్రమ రవాణాకు పాల్పడడం, వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి చర్యలకు పాల్పడే వారిపై గట్టి నిఘా ఉంచి నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నల్గొండ జిల్లా నేరేడుగుమ్ము మండలంలో విముక్తి కలిగిన వెట్టిచాకిరి కార్మికులను బుధవారం కార్మిక శాఖ అధికారులు కలెక్టర్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు మనుషులను అంగడి సరుకుగా మార్చి ఇతరులకు విక్రయిస్తున్నారన్నారు. పనులు కల్పిస్తామని ఆశ చూపి ఇతర ప్రాంతాలకు తరలించి వెట్టి చాకిరీకి పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి వాటిని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జూలై 30వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించి దానిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అక్కడ గుర్తించిన వారంతా విజయవాడ వారే..
ఇటీవల నల్గొండ జిల్లా నేరుడుగుమ్ము మండలంలో వెట్టిచాకిరికి పాల్పడే వారిపై నల్గొండ జిల్లా అధికారులు దాడులు చేసి వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి కల్పించామన్నారు. ఇందులో నలుగురు వ్యక్తులు తాము విజయవాడ ప్రాంతానికి చెందిన వారమని తెలియజేయడంతో ఎన్టీఆర్ జిల్లా కార్మిక శాఖ అధికారులకు అప్పగించారన్నారు. నల్గొండ జిల్లా నేరేడుగుమ్ము మండలంలో విముక్తి కలిగిన వారిలో విజయవాడకు చెందిన దేవరగిరి శీలం వెంకయ్య ఉన్నారని వారి ఆధార్‌కార్డుల ఆధారంతో కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. గొల్లబ్రోలు వెంకటేశ్వర్లు, బూక్యా వెంకన్నల వద్ద ఆధార్ కార్డులు కూడా లేవని వారిని పూర్తిగా విచారించి వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించామన్నారు. కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ సీహెచ్ ఆశారాణి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ