
గొల్లపూడిలో హోం మంత్రి పర్యటన
భవానీపురం(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గొల్లపూడి గ్రామం మౌలానగర్‌లో మంగళవారం జరిగింది. రాష్ట్ర హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజల బాగోగులు, సంక్షేమ పథకాల వర్తింపు గురించి నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలను రూపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహిళలకు ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం అమలు చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదిక అన్నారు. గొల్లపూడి ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు, బొమ్మసాని సుబ్బారావు, నారద తదితరులు పాల్గొన్నారు.